దెబ్బకు భారత్ ముందు మోకరిల్లిన పాకిస్థాన్!
భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న అత్యంత సున్నితమైన అంశాలలో ఒకటైన సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం, ఆర్థిక నష్టాల భయం పెరిగిపోయింది.
పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బహిరంగ ఆందోళన
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటీవల జరిగిన ఈయూ ఇండో-పసిఫిక్ మినిస్టీరియల్ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశంపై బహిరంగంగా తన ఆందోళన వ్యక్తం చేశారు. "భారత్ సింధు నది నీటి ప్రవాహాన్ని ఎప్పుడైనా ఆపగలదు. ఇలా చేయడం ఈ ప్రాంతం సమగ్రత, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు. ఈ చర్య పర్యావరణ, మానవతా సంక్షోభానికి దారి తీస్తుంది." అని ఇషాక్ దార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒక అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ చర్యల వల్ల ఎదురయ్యే ముప్పును ఆ దేశ ఉప ప్రధాని స్వయంగా అంగీకరించడం గమనార్హం.

'వాటర్ స్ట్రైక్' వల్ల పెరిగిన పర్యావరణ ముప్పు
పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన ప్రకటన సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన 'ఎకోలాజికల్ థ్రెట్ రిపోర్ట్ 2025' లోని అంచనాలకు బలం చేకూర్చింది. భారత్ తన సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా నిర్మించిన ఆనకట్టలు, ఇతర జలవనరుల ప్రాజెక్టుల ద్వారా సింధు, దాని సహాయక నదులైన చీనాబ్, జీలం నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఈ నియంత్రణ వల్ల పాకిస్తాన్‌లో అకస్మాత్తుగా కరువు లేదా ప్రవాహం పెరిగినప్పుడు భారీ వరదలు వంటి పర్యావరణ విపత్తులు సంభవించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
యూరప్ దేశాల సహాయం కోసం దీనంగా విజ్ఞప్తి
భారత్ 'వాటర్ స్ట్రైక్' చర్య పాకిస్తాన్‌పై చూపే తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇషాక్ దార్ ఈ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని యూరప్ దేశాలను అభ్యర్థించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్‌ను కోరాల్సిందిగా, ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని ఐరోపా సమాఖ్య(ఈయూ) సభ్య దేశాలను ఇషాక్ దార్ విజ్ఞప్తి చేశారు. ఒప్పందం రద్దు చేయబడితే, పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతాలైన పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో నీటి సంక్షోభం తీవ్రమవుతుంది.
పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక ఎదురుదెబ్బ
సింధు నదీ జలాలపై ఆధారపడిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం రద్దు ఒక పెను సవాలుగా మారింది. వ్యవసాయ రంగం (ముఖ్యంగా పంజాబ్‌లో), విద్యుత్ ఉత్పత్తి, వస్త్ర, చక్కెర, ఆహార శుద్ధి వంటి కీలక పరిశ్రమలు సింధు నీటిపై ఆధారపడి ఉన్నాయి. నీటి కొరత ఈ పరిశ్రమలను దెబ్బతీస్తుంది. నీటి లభ్యత లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 4 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకు భారీ నష్టం వాటిల్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం ఇప్పటికే కుదేలైన పాక్ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదకరంగా మారవచ్చు.












Click it and Unblock the Notifications