మేమే కూల్చాం, ప్రధాని మా టార్గెట్: పాకిస్తాన్ తాలిబన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలిన సంఘటనపై పాకిస్తాన్ తాలిబన్లు స్పందించారు. ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చింది తామేనని వారు చెప్పుకున్నారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.
హెలికాప్టర్‌ను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్‌తో కూల్చినట్లు తాలిబన్లు చెప్పుకున్నారు. అయితే, నిజంగానే హెలికాప్టర్‌ను తాలిబన్లు కూల్చేశారా, కూలిన తర్వాత వారు కావాలని తామే కూల్చినట్లు చెప్పుకుంటున్నారా అనేది కచ్చితంగా చెప్పలేమని పాకిస్తాన్ సైనిక వర్గాలంటున్నాయి.

పాకిస్తాన్ తాలిబన్ ప్రధాన అధికార ప్రతినిధి ముహమ్మద్ ఖోరసాని పేరు మీద తాలిబన్ల ప్రకటన ఉర్దూలో వెలువడింది. రెండు ప్రాజెక్టులను ప్రారంభించడానికి మరో హెలికాప్టర్‌లో నవాజ్ షరీఫ్ గిల్గిట్ ఉత్తర పర్వత ప్రాంతాల్లోకి ప్రయాణిస్తుండగా ఆ ప్రమాదం సంభవించింది. నవాజ్ షరీఫ్ వెనక్కి తన కార్యాలయానికి వచ్చినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
ఆర్మీ హెలికాప్టర్ పాఠశాల ఆవరణలో కూలింది. దీంతో పాఠశాలలో మంటలు లేచాయి. మృతుల సంఖ్య పెరగవచ్చునని ఆర్మీ చెబుతోంది.












Click it and Unblock the Notifications