పాకిస్తాన్‌లో చిచ్చు పెట్టిన టమాటో
పాకిస్తాన్ ప్రజల జీవితంలో ఇప్పుడొక ఊహించని మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రతి వంటింట్లో సర్వసాధారణంగా కనిపించే టమాటా, నేడు దేశంలో అత్యంత ఖరీదైన విలాస వస్తువుగా మారిపోయింది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరిన వేళ, నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఒక కిలో టమాటాల ధర ఏకంగా రూ.600 పలుకుతోంది. కేవలం నెల రోజుల్లోనే 400 శాతం పెరుగుదల నమోదు కావడంతో, సామాన్యుల జీవితాలు మరింత కష్టతరమయ్యాయి. వంటింటి బడ్జెట్ తలకిందులై, కూరల్లో రుచి కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

పార్లమెంట్‌ను చేరిన టమాటా గోల
ఈ భరించలేని ధరల పెరుగుదల దేశ పార్లమెంట్‌ను కూడా తాకింది. టమాటా ధరలపై చర్చ సందర్భంగా ఒక ఎంపీ వ్యంగ్యంగా మాట్లాడుతూ, టమాటాలు కొనాలంటే బ్యాంక్‌లో రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మరొక సభ్యుడు పాత రోజులను గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు భారత్ నుంచి చవకగా టమాటాలు దిగుమతి చేసుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, ఓ ఎంపీ టమాటాను చేతిలో పట్టుకుని, ఈ టమాటా ధర రూ.75 అని చెప్పడం, దాన్ని దొరికించుకోవడం ఎంత కష్టమైందో వివరించడం ప్రజల ఆగ్రహానికి, నిస్సత్తువకు అద్దం పడుతోంది.
సరిహద్దు మూసివేత ప్రధాన కారణం
టమాటా ధరలు ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం - పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మూసివేత. అక్టోబర్ 11న జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత వైమానిక దాడుల నేపథ్యంలో 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు మూతపడింది.
భారత్ నుంచి దిగుమతులు నిలిచిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఎక్కువగా టమాటాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌పై ఆధారపడుతోంది. సరిహద్దు మూసివేయడంతో, కూరగాయలు, మందులు, ఆహార ధాన్యాలు వంటి దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన సరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో సరఫరా గొలుసు దెబ్బతిని, ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ మూసివేత కారణంగా రోజుకు దాదాపు ఒక మిలియన్ డాలర్ల నష్టాన్ని రెండు దేశాలు చవిచూస్తున్నాయి.
టమాటా ఒక్కటే కాదు, కూరగాయల ధరలు అన్నీ అమాంతం పెరిగాయి. వెల్లుల్లి రూ.400, అల్లం రూ.750, బటానీలు రూ.500, ఉల్లిపాయలు రూ.120కి చేరగా, చిన్న కొత్తిమీర కట్ట కూడా రూ.50కి అమ్ముడవుతోంది. జీవన వ్యయం పెరుగుతుండటంతో, టమాటాలు, కూరగాయలు ఎప్పుడు చవకగా దొరుకుతాయా అని ప్రతి సామాన్య పాకిస్తానీ ఎదురుచూస్తున్నాడు.












Click it and Unblock the Notifications