గంగలో చికెన్ బిర్యానీ తింటే జైలుశిక్షా ? కోర్టుల తీరుపై సుప్రీం జడ్జి ఫైర్..!
దేశంలో ప్రశ్నించే గొంతులపై నమోదవుతున్న కేసులపై న్యాయవ్యవస్ధ అనుసరిస్తున్న వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ (Justice Ujjal Bhuyan) సూటి విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గంగా నదిలో చికెన్ బిర్యానీ తిన్నారంటూ 14 మందిని మూడు నెలలుగా జైల్లో ఉంచడం, అలాగే గాజాకు మద్దతుగా ఆందోళన చేశారంటూ అరెస్టులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి హానికరం కాని కేసుల్లో న్యాయవ్యవస్ధ విధిస్తున్న శిక్షలపై ఉజ్జల్ భూయాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ (NLIU)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. న్యాయస్థానాలు రాజ్యాంగ స్వేచ్ఛలను పరిరక్షించాలని, భారతదేశంలో భిన్నాభిప్రాయాలకు ఉన్న ప్రజా వేదిక పరిధి తగ్గిపోతోందని హెచ్చరించారు. గంగానదిలో పడవలో రంజాన్ ఉపవాసం విరమిస్తూ చికెన్ బిర్యానీ తిన్నందుకు దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్న 14 మంది ముస్లిం పురుషుల ఇటీవలి అరెస్టును ఉదహరిస్తూ, జస్టిస్ భూయాన్ ఈ క్రిమినల్ చర్యకు ఆధారమేమిటని ప్రశ్నించారు. చికెన్ బిర్యానీ తినడం నేరం కాదని తాను ఖచ్చితంగా చెప్పగలనని, గంగా నదిపై చికెన్ తినడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదని గుర్తుచేశారు. సరిగ్గా అదే కారణంతో వారిని అరెస్టు చేశారని, వారు మూడు నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు.

ఇలాంటి చర్యకు పాల్పడినందుకు ప్రజలను అరెస్టు చేసి, 3 నెలల పాటు బెయిల్ నిరాకరించవచ్చా అని నన్నే నేను ప్రశ్నించుకుంటున్నానని ఉజ్జల్ భూయాన్ తెలిపారు. పౌరులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన తెలిపారు.
భారతదేశంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రజా వేదిక కుంచించుకుపోతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలు. చర్చ, భిన్నాభిప్రాయాలే ప్రజాస్వామ్యానికి సారం అన్నారు. దురదృష్టవశాత్తు, అధికారిక కార్యక్రమాలను కూడా నేరంగా పరిగణిస్తున్నారని జస్టిస్ భూయాన్ చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది.












Click it and Unblock the Notifications