పుతిన్, జెలెన్ స్కీలతో మోడీ చర్చలు-భారత్ గొప్ప దౌత్య విజయమేనా..?
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సంక్లిష్ట రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో తాజాగా రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన భేటీలు భారత్ ను కీలక స్ధానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో బారత్ పాటించిన సంయమనం, ఆ తర్వాత ప్రదాని మోడీ ఈ ఇద్దరు దేశాధినేతలతో జరిపిన చర్చలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలవగా.. కమ్యూనిస్టు దేశాలు, పాశ్చాత్య దేశాల శత్రుదేశాలు రష్యాను సమర్దించాయి. కానీ భారత్ మాత్రం ఈ రెండూ చేయలేదు. ఓవైపు రష్యాతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు ఉక్రెయిన్ తో యుద్దాన్ని ఆపాల్సిన అవసరాన్ని పుతిన్ కు పదే పదే గుర్తుచేసింది. అంతే కాదు రష్యాను ఏకాకిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు చేసిన ప్రయత్నాలను చమురు కొనుగోళ్ల ద్వారా బారత్ తిప్పికొట్టింది.

పుతిన్, జెలెన్ స్కీతో మోడీ భేటీలు
రష్యా-ఉక్రెయిన్ యుద్దం తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయిన పుతిన్, జెలెన్ స్కీలతో ప్రధాని మోడీ తాజా భేటీలు అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న శాంతి ప్రదాత ముద్రను మరింత సుస్థిరం చేసింది. అలీన విధానంతో పాటు శాంతి కాముక దేశంగా భారత్ కు ఉన్న పేరు దీంతో మరింత పెరిగింది. అలాగే శాంతి, సుస్థిరతల విషయంలో భారత్ కు ఉన్న నిబద్ధతను ప్రధాని మోడీ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల చర్చలతో మరోసారి చాటిచెప్పారు. ఓవైపు రష్యా సైనిక సంపత్తి, టెక్నాలజీ, మరోవైపు అమెరికా వాణిజ్యం, రక్షణ సామాగ్రి దిగుమతులు చేసుకుంటున్న భారత్ ఇప్పుడు ఈ రెండు దేశాలకూ వ్యతిరేకం కాదన్న సంకేతాలను ప్రధాని తాజా భేటీలతో ఇచ్చేశారు.
భారత్ కు దౌత్య విజయం
రష్యా-ఉక్రెయిన్ యద్దంపై అంతర్జాతీయంగా భిన్నవైఖరులు వ్యక్తమవుతున్నా.. రష్యా, అమెరికా ఇద్దరితోనూ సత్సంబంధాలను కొనసాగిస్తామన్న సంకేతం ఇవ్వగలగడం ప్రధాని మోడీ భారత్ కు సాధించి పెట్టిన పెద్ద దౌత్య విజయంగా బావిస్తున్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును కొనసాగిస్తూనే, అమెరికాతో రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడమే ఇందుకు కారణం. ఈ సమన్వయం వల్ల భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడమే కాకుండా బహుళ ధ్రువ ప్రపంచంలో స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కూడా మన దేశం ప్రదర్శించినట్లయింది.












Click it and Unblock the Notifications