ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ
గత 20 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను ఉద్ధృతం చేసింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన, స్టెబిలిటీపై మాట్లాడారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ శాంతి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. 8 రోజుల వ్యవధిలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడటం ఇది రెండోసారి. అయితే తాజాగా జరిపిన సంభాషణలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడికి 'ఈద్' అలాగే ఇరాన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే పశ్చిమాసియా ప్రాంతంలోని కీలకమైన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని, దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్ ను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం ద్వారా రవాణా సరఫరా స్వేచ్ఛగా కొనసాగాలని నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరాన్ లో నివసిస్తున్న భారత పౌరుల భద్రత కోసం ఇరాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

గతంలో మార్చి 12న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. ఆ తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్ తదితర అధినేతలతో ప్రధాని మోదీ సంభాషించి అక్కడి పరిస్థితులపై చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications