Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత-వాటికన్ ప్రకటన..!
లాటిన్ అమెరికాకు చెందిన తొలి పోప్ ప్రాన్సిస్ ఇవాళ కన్నుమూశారు. 88 ఏళ్ల పోప్ ఇవాళ చనిపోయినట్లు వాటికన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటలీ కాలమానం ఈ ఉదయం 7.35 నిమిషాలకు ఆయన తిరిగి దేవుడి వద్దకు చేరుకున్నట్లు వాటికన్ టెలిగ్రామ్ ఛానల్లో విడుదల చేసిన ఓ వీడియో ప్రకటనలో వెల్లడించింది.
తాజాగా ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్. ఆదివారం ప్రసంగంలో ఆలోచనతో, స్వేచ్ఛ, సహనంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాసిలికా బాల్కనీ నుండి 35 వేలకు పైగా జనం హాజరైన ఈ కార్యక్రమంలో పోప్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫ్రాన్సిస్ తన సాంప్రదాయ "ఉర్బి ఎట్ ఓర్బి" ఆశీర్వాద పఠనాన్ని ఒక సహచరుడికి అప్పగించారు. మత స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకుండా శాంతి ఉండదంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూదు వ్యతిరేకతను, గాజాలో పరిస్ధితుల్ని ఆయన పరోక్షంగా ఖండించారు.

ఆ తర్వాత ఇవాళ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసినట్లు వాటికన్ ప్రకటించింది. రోమన్ కాథలిక్ చర్చికి మొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు అయిన పోప్, తన పూర్వీకుడు బెనెడిక్ట్ XVI రాజీనామా తర్వాత 2013లో పోప్ పదవిని అధిష్టించారు. పోప్ తన 12 సంవత్సరాల పదవీ కాలంలో పలు అనారోగ్యాలతో బాధపడ్డారు. ఇటీవల ఆయన డబుల్ న్యుమోనియా నుండి బయటపడ్డారు.
అర్జెంటీనాలో జార్జ్ మారియో బెర్గోగ్లియోగా జన్మించిన ఫ్రాన్సిస్.. అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ కావడం విశేషం. ఆయన మార్చి 13, 2013న 76 సంవత్సరాల వయసులో పోప్‌గా ఎన్నికయ్యారు. పేదల పట్ల శ్రద్ధకు పేరుగాంచిన అర్జెంటీనా మతాధికారిని బయటి వ్యక్తిగా చూసిన అనేక మంది చర్చి పరిశీలకులను ఆయన ఆశ్చర్యపరిచారు. పిల్లల లైంగిక వేధింపుల కుంభకోణంపై దాడికి గురైన, వాటికన్ బ్యూరోక్రసీలో అంతర్గత కలహాలతో నలిగిపోయిన చర్చికి ఆయన నేతృత్వం వహించారు. 12 సంవత్సరాలకు పైగా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ బ్యూరోక్రసీని పునర్వ్యవస్థీకరించారు. అలాగే నాలుగు ప్రధాన బోధనా పత్రాలను రాశారు. 65 కంటే ఎక్కువ దేశాలకు 47 విదేశీ పర్యటనలు చేశారు. అలాగే 900కి పైగా సెయింట్స్ ను తయారు చేశారు.












Click it and Unblock the Notifications