రష్యాలో తిరుగుబాటుదారులకు పుతిన్ వార్నింగ్- దేశద్రోహుల్ని వదిలిపెట్టం-జాతినుద్దేశించి ప్రసంగం..
రష్యాలో పారామిలటరీ గ్రూప్ అయిన వాగ్నర్ చేసిన తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ అక్కడి నగరాలను ఆక్రమిస్తున్న రష్యా సైన్యానికి స్వదేశంలో వాగ్నర్ తిరుగుబాటు సమస్యగా మారింది. ఇప్పటికే రష్యాలో రెండు నగరాలు కైవసం చేసుకున్నట్లు వాగ్నర్ గ్రూప్ చేసిన ప్రకటన రష్యా సైన్యం డొల్లతనాన్ని ప్రపంచానికి వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
వాగ్నర్ తిరుగుబాటుపై స్పందించిన పుతిన్, దేశ ప్రజల్ని రక్షించుకునేందుకు దేనికైనా సిద్ధమని ప్రకటించారు. స్వలాభం కోసం వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తున్నాడని, ఇది రష్యాకు వెన్నుపోటుతో సమానమన్నారు. దేశద్రోహ చర్య కోసం ఆయుధాలు పట్టినవారిపై కఠిన చర్యలు తప్పవని పుతిన్ హెచ్చరించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని రక్షించుకునేందుకు తీవ్ర చర్యలకు వెనుకాడబోనని ఆయన వాగ్నర్ గ్రూప్ ను హెచ్చరించారు.

అంతకు ముందు వాగ్నర్ గ్రూప్ రెండు రష్యన్ నగరాలు రోస్టోవ్-ఆన్-డాన్, వొరోనెజ్‌లోని కీలకమైన సైనిక సౌకర్యాలను తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. రష్యా పారామిలటరీ యూనిట్ అయిన వాగ్నర్ గ్రూప్ అధినేత యవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఆయన్ను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తోంది. అలాగే ఆయనతోపాటు ఉన్నవాగ్నర్ గ్రూప్ సాయుధుల్ని మోసపోవద్దని కోరింది. లొంగిపోతే వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెబు్తోంది
కానీ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ప్రిగోజిన్ మాత్రం రష్యా సైన్యం తమ క్యాంపుపై దాడి చేసి భారీ మొత్తంలో కిరాయి సైనికుల్ని హతమార్చిందని ఆరోపించారు. దీనికి ప్రతీకారం తప్పదన్నారు. ఇప్పటికే రెండు కీలక నగరాల్లో సైనిక స్ధావరాల్ని ఆక్రమించినట్లు ప్రకటించిన ప్రిగోజిన్.. ఇప్పుడు మాస్కో దిశగా కదులుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications