ప్రిన్సెస్ డయానా టైమ్ కాప్స్యూల్ ఓపెన్.. ఏమున్నాయంటే ?
ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రేమించబడిన మహిళలలో ఒకరు ప్రిన్సెస్ డయానా. 1961 జూలై 1న ఇంగ్లాండ్‌లో జన్మించిన డయానా స్పెన్సర్, 1981లో బ్రిటన్ యువరాజు చార్ల్స్‌ను వివాహం చేసుకొని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయ్యారు. బ్రిటన్ రాయల్ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. మరి ముఖ్యంగా ఆ సమయంలో HIV ఉన్నవారిని తాకటానికే ప్రజలు వెనుకాడుతుంటే.. డయానా వాళ్లతో కూర్చుని, చేయి పట్టుకొని మాట్లాడిన దృశ్యం ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చింది.
1997 ఆగస్టు 31న పారిస్‌లో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో డయానా మరణించారు. లండన్ వీధుల్లో లక్షలాది మంది ఆమె అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. ఆ రోజు బ్రిటన్ మాత్రమే కాదు మొత్తం ప్రపంచం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆమె మరణించి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా.. డయానా పేరు ఇంకా ప్రజల హృదయాలలో సజీవంగానే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే డయానాకి చెందిన ఒక టైమ్ క్యాప్సూల్‌ను ఇప్పుడు ఓపెన్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టైమ్ క్యాప్సూల్ ఓపెన్..
లండన్‌లోని ప్రఖ్యాత గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (GOSH) ప్రాంగణంలో ఈ టైమ్ క్యాప్సూల్ బయటపడింది. 1991లో ఆసుపత్రిలోని వెరైటీ క్లబ్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా డయానా ఈ క్యాప్సూల్‌ను భూమిలో భద్రపరిచారు. అది ఓపెన్ చేయగా అందులో.. 1990ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అనేక ఆసక్తికరమైన వస్తువులు లభించాయి. అయితే నిజానికి ఈ టైమ్ క్యాప్సూల్‌ను వందల ఏళ్ల పాటు భూమిలోనే ఉంచాలనేది అసలు ఉద్దేశం అని.. కానీ ఆసుపత్రిలో కొత్తగా చిల్డ్రన్స్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణ పనులు చేపట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తవ్వి తీయాల్సి వచ్చిందని అంటున్నారు.
ఏం ఏం ఉన్నాయంటే..?
- ప్రముఖ పాప్ సింగర్ కైలీ మినోగ్ 'రిథమ్ ఆఫ్ లవ్' ఆల్బమ్ సీడీ
- క్యాసియో కంపెనీ తయారు చేసిన పాకెట్ సైజ్ టెలివిజన్
- సోలార్ కాలిక్యులేటర్
- కొన్ని బ్రిటిష్ నాణేలు
- ప్రిన్సెస్ డయానా ఫోటో
- యూరోపియన్ పాస్‌పోర్ట్
- ఆ రోజు నాటి 'ది టైమ్స్' దినపత్రిక
వీటిని 'బ్లూ పీటర్' అనే చిల్డ్రన్స్ టీవీ షో నిర్వహించిన పోటీలో గెలిచిన సిల్వియా ఫౌల్క్స్ మరియు డేవిడ్ వాట్సన్ అనే ఇద్దరు పిల్లలు ఎంపిక చేశారు.

ప్రిన్సెస్ డయానాకు ఈ ఆసుపత్రితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె 1989 నుంచి 1997లో మరణించే వరకు ఈ ఆసుపత్రికి ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. తరచూ ఇక్కడికి వచ్చి పిల్లలతో సమయం గడపడమే కాకుండా, ఆసుపత్రి నిధుల సేకరణ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2028 నాటికి పూర్తికానున్న కొత్త క్యాన్సర్ సెంటర్ నిర్మాణంలో కొత్త టైమ్ క్యాప్సూల్‌ను భద్రపరచాలని ఆసుపత్రి యాజమాన్యం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications