గ్రీన్‌ల్యాండ్ అగ్నికి ఆజ్యం పోసిన పుతిన్
డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేసిన ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తెర మీదికి వచ్చారు. యూరప్ దేశాలను మరింత రెచ్చగొట్టారు. ఉక్రెయిన్ విషయంలో యూరోపియన్ దేశాలతో చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్‌ల్యాండ్ పై జరుగుతున్న ప్రస్తుత వివాదంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అంటూనే ఇందులో మరింత ఆజ్యం పోశారు..
గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ ఎప్పుడూ ఓ వలస ప్రాంతంగానే చూసిందని, దాని పట్ల చాలా కఠినంగా, క్రూరంగా వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. దీనికి గల కారణాలను వివరించారు. గ్రీన్‌ల్యాండ్‌కు ఏకంగా ధరను నిర్ణయించారు. నేటి మార్కెట్ విలువ ప్రకారం దాని ధర 200 నుండి 250 మిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మొత్తం ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రష్యా భద్రతా మండలి సమావేశంలో గ్రీన్‌ల్యాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు పుతిన్. గ్రీన్‌ల్యాండ్ యాజమాన్యంపై జరుగుతున్న ప్రస్తుత వివాదంతో రష్యాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది తమ పరిధిలో లేనిదని, తమకు సంబంధించిన అంశం కాదని అన్నారు. ఇందులో తాము జోక్యం చేసుకోబమనీ చెప్పారు. వాళ్లే పరిష్కరించుకుంటారని తాను భావిస్తున్నట్లు అమెరికా- యూరోపియన్ యూనియన్ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గ్రీన్ ల్యాండ్ ఎవరైనా కొనుగోలు చేయవచ్చనే తన వాదనలకు చారిత్రక ఉదంతాలను గుర్తు చేశారు. చరిత్ర పుటలను తిరగేశారు. 1867లో అలస్కాను రష్యా యునైటెడ్ స్టేట్స్‌కు విక్రయించిందని పుతిన్ గుర్తు చేశారు. అలస్కా విస్తీర్ణం సుమారు 1.717 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుందని, తమకు చెందిన ఈ భూభాగాన్ని 7.2 మిలియన్ డాలర్లకు అమెరికా కొనుగోలు చేసిందని ఆయన వివరించారు. నేటి ధరల ప్రకారం ఈ మొత్తం సుమారు 158 మిలియన్ డాలర్లు అవుతుంది అని లెక్క కట్టారు.
అలస్కా విస్తీర్ణంతో పోల్చుకుంటే గ్రీన్‌ల్యాండ్ సుమారు 449-450 వేల చదరపు కిలోమీటర్ల తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. అలస్కా కోసం అమెరికా తమకు చెల్లించిన ధరతో పోలిస్తే గ్రీన్‌ల్యాండ్ విలువ సుమారు 200-250 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆనాటి బంగారం ధరల ప్రకారం గ్రీన్‌ల్యాండ్‌ను విలువ కడితే అది దాదాపు ఒక బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా గతంలో డెన్మార్క్ నుండి వర్జిన్ ఐలాండ్స్‌ను కూడా కొనుగోలు చేసిందని పుతిన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications