మోడీపై ఒత్తిడి తెస్తే..! ఏం జరుగుతుందో చెప్పేసిన పుతిన్..!
భారత్-రష్యా మధ్య సుదీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. మధ్యలో ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ బంధం కొనసాగుతోంది. దీంతో పశ్చిమ దేశాలు ఎలాగైనా భారత్ పై, ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి ఈ బంధానికి తూట్లు పొడవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందువరుసలో ఉన్నారు. అయితే భారత్-రష్యా మాత్రం తమ బంధం విడిపోకుండా కాపాడుకుంటూనే ఉన్నాయి. ఇదే అంశంపై భారత మీడియాతో మాట్లాడుతూ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీతో మాస్కోకు ఉన్న బంధాన్ని మరోసారి గుర్తుచేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. రష్యాతో సహకారాన్ని తగ్గించుకోవాలని భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమైనవని, ప్రపంచ స్థిరత్వానికి హానికరమని ఆయన తేల్చేశారు. ఈ సందర్భంగా భారత్ ఆర్థిక వృద్ధిని, దాని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. ఆ దేశంతో తమ ఆర్థిక సంబంధాలను విస్తరించుకోవడానికి రష్యా నిశ్చయించుకుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకునే దిశలో ఉందన్నారు.

ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును కనబరిచిన అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటని, ఇది ఆకస్మికంగా జరిగింది కాదని, ప్రధాని మోదీ (Pm modi) నాయకత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమే అని పుతిన్ తెలిపారు. న్యూఢిల్లీ తన సొంత జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తుందని రష్యా అధ్యక్షుడు తెలిపారు. అమెరికాతో భారతదేశ దౌత్య సంబంధాలు రష్యాతో భారతదేశానికి ఉన్న చిరకాల సంబంధానికి ఆటంకం కలిగించవని లేదా దెబ్బతీయవని తేల్చేశారు.భారత్ తన ప్రయోజనాలకు ముఖ్యమని భావించే అన్ని దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం తమకు సంతోషంగా ఉందని, అదే సమయంలో, రష్యాతో సహకారం విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నించాయని రష్యా అధ్యక్షుడు ఆరోపించారు. మోదీ, భారత్ పై ఒత్తిడి అంతర్జాతీయ సంబంధాలకు హానికరమని అందరూ అర్థం చేసుకున్నాన్నారని పుతిన్ తెలిపారు.














Click it and Unblock the Notifications