వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీ సింధు: చాలా ఒత్తిడి నడుమ ఈ పతకాన్ని గెలిచాను

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో పోలిస్తే, టోక్యోలో కాంస్య పతకం చాలా ఒత్తిడి, బాధ్యతల నడుమ గెలిచానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పారు.

ఈ రెండు పతకాలను మీరు ఎలా చూస్తున్నారు? అని బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు.

''అప్పడు నేను కాస్త చిన్న పిల్లలను. నాపై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. నేనొక కొత్త అమ్మాయిని. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఈ రెండింటిని ఒకదానితో మరొకటి పోల్చిచూస్తే, కచ్చితంగా ఒత్తిడి, బాధ్యతలు పెరిగాయనే చెప్పాలి. నా కెరీర్‌లోనూ ఎత్తుపళ్లాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అంతా బావుంది. నా గేమ్ స్టైల్ మెరుగుపడింది. ఇక్కడ పతకం సాధించడం అనేది నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం’’అని ఆమె అన్నారు.

''నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు వరుసగా రెండు పతకాలు వచ్చాయి. ఒకటి 2016లో. రెండోది ఇప్పుడు. నేను చాలా శ్రమించాను. పతకాలు సాధించాలంటే మనం కష్టపడాలి.’’

టోక్యో ఒలింపిక్స్ మహిళ సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం చైనాకు చెందిన హె బింగ్ జియావోపై సింధు విజయం సాధించారు. 53 నిమిషాలపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో సింధు గెలిచారు.

పీవీ సింధు

కాసేపు అసలేమీ అర్థం కాలేదు

ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించడంపై మీరేమంటారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''కాసేపు నాకు అసలేమీ అర్థంకాలేదు. మ్యాచ్ పూర్తయిన తర్వాత, నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నేను అలానే కాసేపు నిలబడిపోయాను. ఐదారు సెకన్ల తర్వాత, గట్టిగా అరిచాను. ఆ తర్వాత మా కోచ్‌ దగ్గరకు వెళ్లి ఆయన్ను హత్తుకున్నాను’’అని చెప్పారు.

తన విజయంలో కోచ్ పార్క్ తేసంగ్ పాత్రపైనా ఆమె మాట్లాడారు. ''ఆయన చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆయన నా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి సమయాల్లోనూ ఆయన రోజంతా నాతోనే ఉండేవారు. లాక్‌డౌన్‌లు, ఆంక్షల వల్ల ఆయన సొంత ఇంటికి కూడా వెళ్లలేకపోయేవారు. ఆయన తన కుటుంబాన్ని మిస్ అవుతున్నారని కచ్చితంగా చెప్పగలను. మనం సాధించగలం అని ప్రతిరోజూ ఆయన ప్రోత్సహించేవారు. మనం కేవలం ఒలింపిక్స్‌పైనే దృష్టిపెడుతున్నాం అని చెప్పేవారు. మొత్తానికి మేం సాధించాం. ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది’’అని సింధు అన్నారు.

సెమీ ఫైనల్స్‌లో ఓటమి గురించి కూడా సింధు స్పందించారు. తను చాలా బాధపడ్డానని, దు:ఖాన్ని దాటుకు రావడానికి కాస్త సమయం పట్టిందని చెప్పారు.

''నిన్న నేను విపరీతమైన నిరాశ, నిస్పృహలకు లోనయ్యాను. అదే మూడ్‌లో ఈ రోజు ఉదయం నిద్రలేచాను. అయితే, 'ఏం ఫర్వాలేదు.. మనకు ఇంకో అవకాశం ఉంది. నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి చాలా తేడావుంది’అని కోచ్ చెప్పేవారు. నా తల్లిదండ్రులు కూడా నిరాశకు గురయ్యారు. వారు దు:ఖాన్ని దాచిపెడుతూ నన్ను ప్రోత్సహించారు’’అని సింధు చెప్పారు.

''ఈ మ్యాచ్ కోసం నేను రోజంతా ఎదురుచూశాను. దీని చుట్టూనే నా ఆలోచనలు తిరిగేవి. ఎప్పుడెప్పుడు దీన్ని మొదలుపెడతానా అనిపించేది.’’

పీవీ సింధు

వ్యూహం మారిందా?

ఈ సారి కొత్త వ్యూహాన్ని ఏమైనా అనుసరించారా? అని ప్రశ్నించినప్పుడు ''కొత్త వ్యూహమేదీ లేదు’’అని ఆమె చెప్పారు.

''బింగ్ జియావో చాలా మంచి ప్లేయర్. చాలా తెలివిగా ఆడతారు. పైగా ఆమెది ఎడమయ చేతి వాటం. అందుకే ఎలాంటి తప్పులూ చేయకుండా ఆటపైనే దృష్టి సారించాలని అనుకున్నాను. నేను స్ట్రైక్ చేసిన ప్రతి పాయింట్ ఆమెకే వెళ్లిపోతుండేది. దీంతో ప్రశాంతంగా ఉంటూ, తర్వాతి స్ట్రోక్ చక్కగా ఇవ్వాలని అనుకునేదాన్ని. మొదటి గేమ్‌లో నేను లీడ్ మెయింటెయిన్ చేశాను. దాన్ని కవర్ చేసేందుకు ఆమె ప్రయత్నించారు. ఇక్కడ ప్రతి పాయింటూ ముఖ్యమే’’ అని సింధు అన్నారు.

వేడుకలపై స్పందిస్తూ.. ''కచ్చితంగా వేడుకలు ఉంటాయి. నేను ఈ క్షణాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నా.’’

పీవీ సింధు

మ్యాచ్ తర్వాత మీరు ఎవరితో మాట్లాడారు. అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను వారిని మిస్ అవుతున్నాను. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లి, వారితో కలిసి వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్నాను. నా ఫ్యాన్స్, స్నేహితులు, కుటుంబ సభ్యులు... అందరినీ మిస్ అవుతున్నాను’’అని ఆమె అన్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ పతకం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందిగా? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ''కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నడుమ పతకం సాధించడానికి అదనంగా ఎలాంటి శ్రమ అవసరం లేదు. ఎందుకంటే, మీరు మ్యాచ్ ఆడేటప్పుడు కేవలం దానిపైనే దృష్టిసారిస్తారు. 100 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే, లాక్‌డౌన్ వల్ల ట్రైనింగ్‌కు కాస్త కష్టమైంది. నేను ఇంటిలోనే శిక్షణ తీసుకునేదాన్ని. మా నాన్న వ్యాయామం చేయడంలో సహకరించేవారు. ఒకసారి లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే, నేను మళ్లీ ఎప్పటిలానే శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. ప్రభుత్వం కూడా మాకు చాలా సహకరించింది’’అని ఆమె వివరించారు.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? మూడో పతకం కూడా తీసుకురావాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''నేను ప్రస్తుతానికి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. కాసేపు ఇలానే ఉండనివ్వండి. నిజమే అది చాలా మంచి ప్రశ్న. నేను మూడో పతకానికి కూడా సన్నద్ధం అవుతాను. అయితే, ఇప్పుడే కాదు’’అని ఆమె నవ్వుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PV Sindhu: I won this medal under a lot of pressure
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X