రేపటి నుంచి గాజాలో కాల్పుల విరమణ- ఇజ్రాయెల్-హమాస్ బందీల విడుదల కూడా..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెల రోజులకు పైగా సాగుతున్న పోరుకు రేపు బ్రేక్ పడబోతోంది. గాజాలో ఇరువర్గాల మధ్య సాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు, చిన్నారులు చనిపోతున్న క్రమంలో అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాల జోక్యంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అలాగే బందీల విడుదలకు కూడా ఇరుదేశాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వీరి ఒప్పందం అమల్లోకి రానుందని ఖతార్ ఇవాళ ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన మానవతా ఒప్పందంలో భాగంగా రేపటి నుంచి బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణ కూడా ప్రారంభమవుతుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు బందీల విడుదల కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. అయితే తొలి రోజు కొంతమంది బందీల్ని మాత్రమే విడుదల చేయబోతున్నారు.

శుక్రవారం కేవలం 13 మందిని విడుదల చేస్తారని, ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలు అందరూ ఇందులో ఉంటారని ఖతార్ తెలిపింది. మొత్తం నాలుగు రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 50 మందిని విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు వెల్లడించింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 150 మందిని విడుదల చేయాల్సి ఉంది.
అక్టోబర్ 7 నుంచి సాగుతున్న ఇజ్రాయెల్, హమాస్ పోరులో నాలుగు రోజుల సంధి సమయంలో కనీసం 50 మంది బందీలను మరియు అనేక మంది పాలస్తీనా ఖైదీలను విడిపించడానికి బుధవారం ఒక ఒప్పందాన్ని ప్రకటించాయి. ఖతార్, ఈజిప్ట్ అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఈ సంధి కుదిరింది. నాలుగు రోజుల పరిస్దితి చూశాక దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. అలాగే గాజాలోని 2.4 మిలియన్ల స్ధానికులకు మానవతా సాయం అందించడం కూడా ఈ సంధిలో భాగంగా ఉంది.












Click it and Unblock the Notifications