అమెరికా అధ్యక్షుడిగా థియోడోర్ రూజ్‌వెల్ట్ ప్రమాణ స్వీకారం.. 125 ఏళ్ల తర్వాత మళ్లీ అదే గదిలో
అది సెప్టెంబర్ 14, 1901. నాటి అమెరికా అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లీపై జరిగిన ఘోర హత్యాయత్నం, ఆపై ఆయన కన్నుమూయడం అమెరికా మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆకస్మికంగా దేశ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చిన నాటి ఉపాధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ అత్యవసరంగా రైలులో న్యూయార్క్‌లోని బఫెలో నగరానికి చేరుకున్నారు. ఏలాంటి భారీ ఏర్పాట్లు లేవు, కనీసం సూటు కూడా లేదు. తన మిత్రుడు ఆన్స్లే విల్కాక్స్ ఇంట్లోని ఒక చిన్న లైబ్రరీ గదిలోనే, ఇతరుల వద్ద అరువు తెచ్చుకున్న దుస్తులు ధరించి అమెరికా 26వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. సరిగ్గా 125 ఏళ్ల తర్వాత, అదే గదిలో, అదే సమయానికి నాటి చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు పునఃసృష్టి (Reenactment) చేసి చూపించడం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంది.
లైబ్రరీ గదిలోనే సీక్రెట్ వేడుక.. కెమెరాలకు నో ఎంట్రీ!
1901 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 1:30 గంటలకు బఫెలో నగరానికి చేరుకున్న రూజ్‌వెల్ట్, మొదట కన్నుమూసిన మెక్‌కిన్లీ భార్యను పరామర్శించారు. అనంతరం తన మిత్రుడి ఇంటి లైబ్రరీని ప్రమాణ స్వీకార వేదికగా ఎంచుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జడ్జి జాన్ ఆర్. హేజెల్ ఆయనతో ప్రమాణం చేయించారు. దేశభద్రత దృష్ట్యా అత్యంత పరిమితమైన మంది సమక్షంలో, పాత్రికేయుల నోట్‌పాడ్‌ల మధ్య ఈ తంత్రం ముగిసింది. ఫొటోగ్రాఫర్లను కూడా ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. ప్రమాణం పూర్తయిన వెంటనే అదే గదిలో తన తొలి అత్యవసర క్యాబినెట్ భేటీని నిర్వహించి, పక్కనే ఉన్న గదిలో తన మొదటి అధికారిక ప్రకటనను విడుదల చేశారు రూజ్‌వెల్ట్.

125 ఏళ్ల తర్వాత పునరావృతమైన నాటి చరిత్ర!
సరిగ్గా 125 ఏళ్ల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, 'థియోడర్ రూజ్‌వెల్ట్ ఇనాగురల్ నేషనల్ హిస్టారికల్ సైట్' ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న నాటి ఘట్టాన్ని పునఃసృష్టి చేశారు. రూజ్‌వెల్ట్ పాత్రలో జీవించే ప్రముఖ కళాకారుడు జో వీగండ్, సరిగ్గా నాడు రూజ్‌వెల్ట్ ప్రయాణించినట్లే ఆమ్‌ట్రాక్ రైలులో బఫెలో నగరానికి చేరుకుని, సాయంత్రం 4:30 గంటలకు చారిత్రాత్మక విల్కాక్స్ ఇంట్లోకి అడుగుపెట్టారు. 1901లో రూజ్‌వెల్ట్ ఉచ్చరించిన అదే 35 పదాల అధ్యక్ష ప్రమాణాన్ని జో వీగండ్ మళ్లీ గంభీరంగా చదివి వినిపిస్తుంటే.. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా శతాబ్దం వెనక్కి వెళ్లినట్లు అనుభూతి చెందారు.
లైవ్ స్ట్రీమింగ్.. దక్కని అరుదైన అవకాశం!
ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, ఆనాటి చారిత్రాత్మక లైబ్రరీ గది అత్యంత చిన్నది కావడంతో కేవలం కొద్దిమంది వీఐపీలకు మాత్రమే ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ఒక్కో వీఐపీ టికెట్ ధరను 500 డాలర్లు (జంటకు 850 డాలర్లు)గా నిర్ణయించారు. ఈ టికెట్ల ద్వారా వచ్చిన నిధులను పౌర విద్యా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం నేషనల్ పార్క్ సర్వీస్ భాగస్వామ్యంతో ఒక చారిత్రక సంపదగా వర్ధిల్లుతున్న ఈ ప్రదేశం, నాటి అమెరికా అత్యవసర రాజకీయ పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications
