హెచ్చరిక: 2045 నాటికి రోబోలతో ఉద్యోగాలు మటాష్
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో సాధిస్తున్న పురోగతి నేపథ్యంలో రానున్న ముప్పై ఏళ్లలో మనుషులు చేసే ప్రతీ పనిని రోబోలు చేస్తాయని, దాంతో ప్రపంచంలోని సగం కంటే ఎక్కువమందికి ఉద్యోగ ముప్పు పొంచి ఉందని అమెరికాలోని రైస్ యూనివర్సిటీకి చెందిన మోషే వర్దీ హెచ్చరిస్తున్నారు.
2045నాటికి రోబోలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానో, వైద్యుడిగానో, డ్రైవర్‌గానో ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో కనిపించే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అంటున్నారు. కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో ఇది సాధ్యమేననీ, దాదాపు సగం మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందంటున్నారు.
రాబోయే ముప్ఫై ఏళ్లలో యంత్రాలు, మరమనుషులు ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించుకుంటాయని, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులను భరించే శక్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

కథలు చదివించడం ద్వారా రోబోల్లో నైతిక ప్రవర్తన పెరిగేలా శాస్త్రవేత్తలు 'క్యుయిక్సోట్' అనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీనిద్వారా శిక్షణ ఇస్తున్నపుడు విషయమంతా ప్లాట్‌గ్రాఫ్‌లో నిక్షిప్తమై ఆ డేటా క్యుయిక్సోట్‌కి అందుతుంది.
ఇది రివార్డ్ సిగ్నల్‌గా రూపాంతరం చెంది ఈ వ్యవస్థ రోబోల్లో నైతిక నియమావళిని గుర్తు చేస్తూ, చెడు ప్రవర్తనలను తొలగిస్తుందని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ రీడిల్ పేర్కొన్నారు. రోబోలు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరగడంతో ఇప్పటికే మధ్య తరహా ఉద్యోగాల సంఖ్య తరిగిపోతోందని, ఈ అంశం ఆదాయ వ్యత్యాసాలకు దారితేసే ప్రమాదముందని అంటున్నారు.












Click it and Unblock the Notifications