Iran Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ పోరు తీవ్రం...! రష్యా, చైనా కీలక నిర్ణయం..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇవాళ ఏడో రోజూ నిరాటంకంగా కొనసాగుతోంది. అంతే కాదు ఈ పోరులో ఇరు దేశాలకూ జరుగుతున్న నష్టం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇవాళ ఇజ్రాయెల్ లోని సోరొకా ఆస్పత్రితో పాటు టెల్ అవీవ్ లోని స్టాక్ ఎక్చేంజ్ పైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించగా.. ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్ లోని లక్ష్యాలపై ప్రతిదాడులు చేస్తోంది. తమ ఆస్పత్రిపై ఇరాన్ దాడిపై మండిపడుతున్న ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేస్తామని ప్రకటించింది.
ఇవాళ ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో పౌర ప్రాంతాలపై అనేక దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయెల్‌లోని సోరోకా ఆసుపత్రితో సహా పౌర నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయని తెలిపారు. సోరోకా ఆస్పత్రిపై జరిగిన దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రవాదంతో సమానమని అభివర్ణించింది.

సోరోకా ఆసుపత్రి మరియు ఇతర పౌర ప్రాంతాలలో పౌరులపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. టెహ్రాన్ ఈ దాడికి ఖచ్చితమైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ .. తమ దేశానికి ముప్పులను తొలగించడానికి, అయతుల్లాల పాలనను అణగదొక్కడానికి ఐడీఎఫ్ తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తుందన్నారు. ఇరాన్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై, టెహ్రాన్‌లోని ప్రభుత్వ లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని ఐడీఎఫ్ ను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తక్షణ కాల్పుల విరమణకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారని, ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలను నివారించడానికి ఇది అత్యున్నత ప్రాధాన్యత కావాలని రష్యా అధ్యక్షుడు ఫుతిన్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడానికి సైనిక చర్య సరైన మార్గం కాదని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చైనా, రష్యా స్పందించి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications