పాకిస్తాన్ లో 22 వేల కోట్ల ప్రాజెక్ట్..? రష్యా క్లారిటీ..! భారత్ తో బంధంపైనా..!
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ పోరుకు మద్దతునిచ్చిన రష్యా.. తాజాగా ఆ దేశంలో 2.6 బిలియన్ డాలర్లు (దాదాపు 22 వేల కోట్లు) విలువైన స్టీల్ మిల్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. రష్యా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయనేది ఈ వార్తల సారాంశం. దీంతో భారత్ కు చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా నిర్ణయంపై ఇరుదేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
పాకిస్తాన్ లోని కరాచీలో సోవియట్ యూనియన్ 70వ దశకాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ మిల్లు ఒకటి 2015 నుంచీ మూతపడి ఉంది. దీన్ని తిరిగి తెరవడంతో పాటు అత్యాధునిక సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు రష్యా, పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు కచ్చితంగా ఊతంగా మారుతుందనే అంచనాలూ మొదలైపోయాయి. రష్యా దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంపై రష్యా తాజాగా స్పందించింది. పాకిస్తాన్ తో ఆర్ధిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వచ్చిన వార్తల్ని రష్యా ఖండించింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేసింది. భారత్ తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా దీన్ని అభివర్ణించింది. అయితే మాస్కో నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే పాకిస్తాన్ తో ఈ స్టీల్ మిల్లు పునరుద్ధరణపై ప్రధాని దూతలతో చర్చలు జరిగాయని, అయితే 22 వేల కోట్ల ఒప్పందంపై సంతకాలు జరిగాయన్నది మాత్రం నిజం కాదని తేలిపోయింది.
భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కూడా దీనిపై పరోక్షంగా స్పందించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ఉన్న దోషులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షించినందుకు ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఎక్కడా ప్రధాని మోదీ విశ్వసనీయతను అనుమానించే వారు ఎవరూ లేరని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన బలమైన నాయకత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. భారత్ ,రష్యా రెండూ ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చెలాయించే దేశాల సమూహం లేకుండా బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి పనిచేస్తాయన్నారు.












Click it and Unblock the Notifications