ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా, బ్రిటన్ చిచ్చు- యూకే విమానాలపై రష్యా బ్యాన్-వాణిజ్య ఆంక్షలతో
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్ర వివిధ దేశాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా యూరప్ లో కీలకమైన బ్రిటన్ ఈ యుద్ధానికి కారణమైన రష్యాపై విధించిన ఆంక్షలు చిచ్చు రేపాయి. వీటికి రష్యా కూడా దీటుగా స్పందించడంతో బ్రిటన్ చిక్కుల్లో పడింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో నిన్న ఆ దేశంలో వాణిజ్య ఆంక్షల్ని విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ దురాక్రమణకు దిగిన రష్యాపై నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ .. అనుకున్నట్లుగానే రష్యా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టకుండా తీసుకోకుండా నిషేధం విధించారు. దీంతో రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.

బ్రిటన్ ఆంక్షల నేపథ్యంలో రష్యా ఇవాళ దీటుగా స్పందించింది. తమపై బ్రిటన్ ఆంక్షల్ని నిరసిస్తూ ఆ దేశ విమానాల్ని తమ గగన తలంపై నుంచి వెళ్లకుండా నిషేధం విధించింది. దీంతో బ్రిటన్ విమానాలు రష్యా గుండా కాకుండా చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.దీనివల్ల బ్రిటన్ విమానాలకు, ప్రయాణికులకు కాలం, డబ్బు వృథా తప్పదు. ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టగానే తమ నిర్ణయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఇతర దేశాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో ఉక్రెయిన్ కు బలగాల్ని పంపే విషయంలో నాటో సభ్య దేశాలతో పాటు ఈయూలోని దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయి.చివరికి ఐక్యరాజ్యసమితి కూడా రష్యా విషయంలో దూకుడుగా స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం రష్యాకు మింగుడు పడలేదు. అయితే ఇదే తరహాలో ఆంక్షలు విధించిన అమెరికా విషయంలో రష్యా ఏమీ చేయలేని పరిస్ధితి ఉంది.












Click it and Unblock the Notifications