ఏయిర్ స్పేస్ పై ఉక్రెయిన్ నిషేధం - భారత విమానం తిరుగు పయణం..!!
ఉక్రెయిన్ పైన రష్యా యద్దం ప్రారంభించటంతో... ఉక్రెయిన్ తమ దేశ ఏయిర్ స్పేస్ ను మూసివేసింది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధాని కీవ్ సహా కీలక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలోఉక్రెయిన్ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీల వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయి. రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో.. ఎయిర్‌పోర్టులను, గగనతలాన్ని మూసివేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ దేశ రాజధాని కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ఇండియా విమానం వెనుదిరిగింది.
భారతీయ విమానం వెనక్కు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావాల్సిన ఎయిర్ఇండియా విమానం.. అర్ధంతరంగా భారత్‌కు తిరుగుపయనమైంది. విమాన రాకపోకలపై ఉక్రెయిన్ నిషేధం విధించిన నేపథ్యంలో.. విమానాన్ని భారత్‌కు మళ్లించారు. ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి 'ఏఐ1947' ఎయిర్ఇండియా విమానం బయల్దేరి వెళ్లింది. కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉంది. అదే సమయంలో, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీలో ల్యాండ్ అయింది.

గగనతలం మూసేసిన ఉక్రెయిన్
182 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాన్ని ఏం చేయాలి.. కొనసాగించాలా లేక..రద్దు చేసి వెనక్కు రప్పించాలా అని భారత అధికారులు చర్చించి.. వెనక్కి పిలిపించేందుకే మొగ్గుచూపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్యారిస్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్.. భారత్‌కు తిరుగుపయనమయ్యారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు..విద్యార్దులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
Recommended Video

రాయబార కార్యాలయం తో సంప్రదింపులు
ఉక్రెయిన్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు కొనసాగడం లేదని పేర్కొంది. దీంతో.. ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే, రష్యా మాత్రం జన సామర్ధ్యాల పైన దాడులు చేయటం లేదని.. ఉక్రెయిన్ సైన్యం లక్ష్యంగా దాడులు సాగుతున్నాయని ప్రకటించింది. ఉక్రెయిన్ ను ఆక్రమించటం తమ లక్ష్యం కాదని రష్యా స్పష్టం చేసింది. ఈ యుద్దం సమయంలో భారత్ ప్రభుత్వం తమ వైఖరి తటస్థమని తేల్చింది. శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నామని కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications