తూర్పు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా: ఆ నగరం చేతికి చిక్కితే.. చెక్ పడినట్టే?
కీవ్: ఉక్రెయిన్‌పై తన యుద్ధాన్ని రష్యా సైనిక బలగాలు మరింత ఉధృతం చేశాయి. తూర్పు ప్రాంతంపై పట్టు బిగించే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ రీజియన్‌లోని కీలక నగరం డాన్‌బాస్‌ను స్వాధీనం చేసుకునే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఈ నగరంపై విరుచుకుపడుతోంది. ఈ పోరులో రష్యా ఇదివరకే కీలక లక్ష్యం అందుకుంది. అజోవ్ సముద్రతీరంలోని మరియోపోల్‌ను స్వాధీనం చేసుకుంది.

మరియోపోల్ స్వాధీనంతో..
మరియోపోల్‌ను రష్యా సైనిక బలగాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. శివార్లలోని అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌ను కైవసం చేసుకున్నాయి. పోర్ట్‌సిటీ కావడం వల్ల మొదటి నుంచీ ఈ నగరంపై పట్టు సాధించడానికి రష్యా సైనిక బలగాలు ప్రయత్నిస్తూ వచ్చినప్పటికీ..ఉక్రెయిన్ దళాలు తిప్పి కొట్టాయి. అదే సమయంలో రాజధాని కీవ్‌ను కూడా చుట్టుముట్టింది. క్షిపణి దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కీవ్ డిఫెన్స్ ఫ్యాక్టరీని నేలమట్టం చేసినట్లు రష్యా ప్రకటించింది.

కీవ్ ఆయుధాగారం నేలమట్టం..
ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ధృవీకరించారు. కీవ్ ఆయుధ కర్మాగారాన్ని తమ బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని తేల్చారు. కీవ్‌పై దాడులను తీవ్రతరం చేస్తూనే.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టుబిగించడానికి రష్యా సైనిక బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నాయి. ఈ ప్రాంతంలోని కీలక నగరం, పారిశ్రామిక కేంద్రంగా భావించే డాన్‌బాస్‌పై దాడులను తీవ్రతరం చేసింది. మరియోపోల్‌తో పాటు డాన్‌బాస్ కూడా రష్యా చేతికి అందితే..తూర్పు ఉక్రెయిన్‌పై పట్టు బిగించినట్టవుతుంది.

బెలారస్ మీదుగా..
ఈ యుద్ధంలో తనకు అండగా నిలిచిన బెలారస్ మీదుగా పెద్ద ఎత్తున సైనిక బలగాలను రష్యా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి తరలిస్తోంది. ఈ విషయంలో బెలారస్ భూభాగాన్ని వినియోగించుకుంటోంది. డాన్‌బాస్‌పై రష్యా సైనిక బలగాలు విరుచుకుపడుతున్నాయనే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ధృవీకరించారు. దీన్ని మలిదశ యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

బలంగా రక్షణ వ్యవస్థ..
డొనెట్స్క్, లుహాన్స్క్, ఖార్కీవ్ రీజియన్లతో పాటు డాన్‌బాస్‌పై దాడులు సాగిస్తోన్నాయని, వాటిని తిప్పికొడుతున్నామని స్పష్టం చేశారు. తమ దేశ రక్షణ వ్యవస్థను ఛేదించే ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని జెలెన్‌స్కీ అన్నారు. డాన్‌బాస్‌ను కైవసం చేసుకోవడానికి రష్యా తన యుద్ధాన్ని తీవ్రతరం చేసిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి ఒలెక్సీ డానిలొవ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ తెలిపారు. రష్యా ప్రయత్నాలను సఫలం కానివ్వబోమని చెప్పారు.












Click it and Unblock the Notifications