అమ్మా.. పరిస్ధితి దారుణంగా ఉంది-పౌరుల్నీ చంపేస్తున్నాం-రష్యా సైనికుడి చివరి మెసేజ్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. తన భద్రతకు ముప్పు ఏర్పడిందన్న సాకుతో రష్యా సాగిస్తున్న మారణకాండలో ఉక్రెయిన్ సైనికులతో పాటు వందలాది పౌరులు కూడా మృత్యువాత పడుతున్నారు. పైకి తాము ఎంపిక చేసిన లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నట్లు అంతర్జాతీయ సమాజాన్ని రష్యా నమ్మిస్తున్నా వాస్తవంగా క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో పరిస్ధితుల్ని తెలియచేస్తూ ఓ రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం తాజాగా వెలుగుచూసింది.
"అమ్మా, నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను.ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు భయంగా ఉంది. మేము అన్ని నగరాలపైనా బాంబులు వేస్తున్నాం. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాము" అని ఉక్రెయిన్‌లోని ఒక రష్యన్ సైనికుడు చనిపోక ముందు తన తల్లికి పంపిన మెసేజ్ బయటపడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో.. ఉక్రెయిన్ రాయబారి ఉక్రెయిన్‌లోని ఒక రష్యన్ సైనికుడు తన తల్లికి పంపినట్లు చెప్తున్న ఈ మెసేజ్ చివరి లైన్లను చదివి వినిపించారు. దీంతో ఉక్రెయిన్ లో పరిస్దితులపై ఐరాస సభ్య దేశాల ప్రతినిధులు షాక్ కు గురయ్యారు.

ఈ మెసేజ్ చదివిన సదరు రష్యా సైనికుడి తల్లి ప్రతిస్పందిస్తూ.. నీ యోగ క్షేమాలు తెలుసుకుని కాలమైంది. నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే ఓ పార్శిల్ పంపేదాన్ని కదా అని చెప్పింది. దీనికి స్పందనగా.. రష్యా సైనికుడు తాను ఉక్రెయిన్ లోనే ఉన్నానని, అయితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అంతే కాదు మమ్మల్ని ఉక్రెయిన్ వాసులు స్వాగతిస్తారని చెప్పి పంపారని, కానీ అక్కడ పరిస్ధితి భిన్నంగా ఉందని తెలిపాడు. ఉక్రెయిన్ వాసులు మా వాహనాల కింద పడి మరీ తమను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. తమను ఫాసిస్టులను పిలుస్తున్నారని, ఇది వినడానికి చాలా కష్టంగా ఉందన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఐరాసలో చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications