ప్రళయం అంటే ఇదేనేమో..: నేపాల్ ప్రకృతి విలయానికి కారణాలు
టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రకృతి విలయానికి కారణమైంది. కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహం, నదులు ఉప్పొంగడం.. వెరసి నేపాల్ లోని కొన్ని గ్రామాలను తుడిచి పెట్టేశాయి. ప్రళయం అంటే ఇదేనేమోననిపించాయి. ఈ బీభత్సానికి వందల మంది గల్లంతయ్యారు. 175 మంది బలి అయ్యారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతూనే పోతోంది.
ఈ విపత్తుపై ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థ శాటిలైట్ ఇమేజీలను సేకరించింది. వీటిని విశ్లేషించింది. మొదట చైనా- నేపాల్ సరిహద్దుల్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాధారణంగా దీని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. భూకంపం సంభవించిన ప్రాంతం అంతా కూడా పర్వతాలతో కూడుకుని ఉన్నది కావడ వల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది. బుధవారం ఉదయం 8:22 నిమిషాల సమయంలో టిబెట్‌లోని గైరోంగ్ కౌంటీలో సంభవించిందీ భూకంపం.

దీని ప్రభావంతో రెండు భారీ గ్లేసియర్ అవలాంచీలు ఏర్పడ్డాయి. అక్కడి లేందీ నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. దీంతో నదిలో ప్రవాహం నిలిచిపోయి నీటి ఒత్తిడి పెరిగింది. నీటి ఒత్తిడి రెట్టింపు అవడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇది ఒక్కసారిగా తెగిపోవడంతో బురద, వరద ముంచుకొచ్చింది. నేపాల్ సరిహద్దుల్లో రసువా జిల్లా టిమురే, స్యాఫ్రుబెసి పరిసర ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో ప్రళయం సంభవించింది.
ఆయా గ్రామల మీదుగా ప్రవహించే త్రిశూలి, భోటేకోశి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. సరిహద్దు గ్రామాలను అతలాకుతలం చేసింది. ఇళ్ళతో పాటు వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఈ వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆకస్మిక వరదలకు భారీ వర్షాలు కారణం కాదని ప్లానెట్ ల్యాబ్ ప్రాథమికంగా నిర్ధారించింది. గ్లేసియర్, కొండచరియలు విరిగిపడటం, అవి త్రిశూలి, భోటేకోశి నదుల ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల తాత్కాలికంగా కృత్రిమ సరస్సు ఏర్పడిందని, అది ఒక్కసారిగా బద్దలై దిగువకు దూసుకువచ్చిందని విశ్లేషించింది.

ఈ హిమాలయ ప్రాంతంలో ఇలాంటి విపత్తులు సంభవించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూలై 8లో కూడా భోటేకోశి నదిలో ఇదే తరహాలో ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పట్లో రసువా సమీపంలోని గ్లేసియల్ లేక్ ఉప్పొంగడంతో వరదలు సంభవించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయింది. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని గ్లేసియర్ల మంచు వేగంగా కరిగిపోతుండటంతో కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. అవి ఈ విపత్తుకు కారణమౌతోన్నాయి.
ఈ విలయం, ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 157కు చేరుకుంది. హిమాలయ పర్వత సానువుల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన బురద, రాళ్లు, వరద ప్రవాహం సరిహద్దు గ్రామాలను అతలాకుతలం చేసింది. చైనాతో నేపాల్‌ను అనుసంధానించే రసువాగఢి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెంధే రివర్ బెల్ట్ మొత్తం కూడా ధ్వంసమైంది. నది పరీవాహక ప్రాంతానికి రెండు వైపులా ఉన్న నివాసాలు కొట్టుకుపోయాయి.

కొండచరియలు విరిగిపడటం వల్ల నదుల ప్రవాహ దిశ పూర్తిగా మారిపోయింది. గ్రామాలపై దూసుకొచ్చింది. సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా శ్మశానాన్ని తలపిస్తోన్నాయి. సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల నుంచి వస్తున్న బురద నీటి ప్రవాహాన్ని చూసి జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఎగువన నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఇంకా పూడిక, కొండచరియల శిథిలాలు నిలిచి ఉండటంతో రెండో ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications