Saudi Prince: లండన్ హోటల్లో శవమై తేలిన సౌదీ యువరాజు - ప్రపంచ దేశాలు షాక్..!
లండన్ లో ప్రపంచ దేశాల్ని షాక్ కు గురిచేసే ఓ ఘటన చోటు చేసుకుంది. సౌదీ అరేబియా యువరాజు( Saudi Prince) అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా లండన్ లోని ఓ విలాసవంతమైనహోటల్లో శవంగా కనిపించారు. మితిమీరిన మద్యం సేవించడంతో పాటు, ప్రమాదకరమైన పార్టీ డ్రగ్స్, ప్రిస్క్రిప్షన్ ఔషధాల ప్రాణాంతక మిశ్రమాన్ని ఒకేసారి తీసుకోవడం వల్లే ఆయన మరణించినట్లు యూకే కోర్టు విచారణలో తాజాగా వెల్లడైంది. లండన్‌లోని మారియట్ హోటల్‌లో లభించిన ఆయన మృతదేహానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ (Abdullah bin Fahad bin Abdullah bin Abdulaziz bin Jalawi Al Saud)లండన్‌లోని కెన్సింగ్టన్ పరిధిలో ఉన్న విలాసవంతమైన మారియట్ హోటల్‌లో కొన్ని రోజుల బస కోసం వచ్చారు. అయితే, మరుసటి రోజు ఆయన గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బందికి బాత్‌రూమ్ ఫ్లోర్‌పై యువరాజు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. వెంటనే వారు అత్యవసర వైద్య సేవల సిబ్బందిని పిలిపించినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మరణానికి ముందు రోజు రాత్రి యువరాజు చివరిసారిగా హోటల్ బయట ఒంటరిగా కనిపించినట్లు సీసీటీవీ విజువల్స్ లో ఉంది.

లండన్ కోర్టులో పోలీసులు సమర్పించిన టాక్సికాలజీ రిపోర్ట్ ప్రకారం, యువరాజు శరీరంలో సాధారణ పరిమితి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. కేవలం ఈ ఆల్కహాల్ స్థాయిల వల్లే మనిషి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కోర్టుకు తెలిపారు. దీంతో జీహెచ్‌బీ అని పిలిచే తీవ్రమైన పార్టీ డ్రగ్, టెన్షన్ తగ్గించే జానాక్స్, గంజాయి వంటి ఇతర మందులను కూడా ఆయన తీసుకున్నట్లు గుర్తించారు. ఈ రసాయనాల తీవ్రమైన కలయికే గుండెపోటుకు దారితీసినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే మరణానికి కొన్ని నెలల ముందు యువరాజు అబ్దుల్లా మద్యపానం, మత్తుమందుల అలవాటు నుండి విముక్తి కోసం చికిత్స తీసుకున్నారని విచారణలో వెల్లడైంది. లండన్‌లోని ప్రముఖ ప్రియరీ క్లినిక్ లో చేరి, వైద్యుల పర్యవేక్షణలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియను కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఫాలో-అప్ సెషన్లకు మాత్రం హాజరు కాలేదు. యువరాజు ఆకస్మిక మృతిపై సౌదీ అరేబియా రాయల్ కోర్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రియాద్‌లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications