రెండేళ్లలో 'హార్మూజ్ జలసంధి' భవితవ్యం ఇదే.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'హార్మూజ్ జలసంధి' పై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఇరాన్, అమెరికా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రెండేళ్లలో హార్మూజ్ జలసంధి అవసరం పెద్దగా రాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ రవాణా కోసం చమురు పైప్ లైన్ ద్వారా భూమి గుండా సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ఉన్న హార్మూజ్ జలసంధిని చోక్ పాయింట్ గా ఇరాన్ వినియోగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రానున్న కాలంలో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ మార్గం మూసుకుపోతుందని అంచనా వేశారు.
దాంతో హార్మూజ్ జలసంధి విలువలేనిదిగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధి అనేక దేశాలకు క్రిటికల్ రూట్ గా మారిందని అన్నారు. కానీ అమెరికాకు మాత్రం హార్మూజ్ జలసంధి చోక్ పాయింట్ కాదని తెలిపారు. మరో 2 సంవత్సరాల్లో హార్మూజ్ కథ ముగుస్తుందని.. అది విలువ లేని నీరుగా మారుతుందని పేర్కొన్నారు. పైప్ లైన్స్ ద్వారా చమురు సరఫరాతో పర్షియన్ గల్ఫ్ ఎనర్జీ కారిడార్ పై ఆధారపడటం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ప్రతి వారం కొత్తగా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు.

మరోవైపు ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగించే ప్రసక్తే లేదని అన్నారు. ఇరాన్ ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నదని దాంతో ఇరాన్ పై అణ్వాయుధం వాడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఇరాన్ చేతికి అణ్వస్త్రాలు చిక్కితే ఇజ్రాయెల్ కు తీవ్ర ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. ఇక హార్మూజ్ జలసంధి అమెరికా అదుపులోనే ఉందన్నారు. అందువల్లనే చాలా చమురు నౌకలు బయటకు వస్తున్నాయని తెలిపారు. అందువల్లే ధరలు పెరగలేదని స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications