సిరియాలో శిధిలాల క్రింద తమ్ముడికి రక్షణా కవచంగా ఏడేళ్ళ అక్క: హృదయాన్ని పిండేసిన వీడియో!!
సిరియాలో శిథిలాల కింద ఉన్న తమ్ముడికి రక్షణ కవచంగా ఏడేళ్ల అక్క వెళ్లిన తీరు, అతడిని కాపాడిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. గుండెను పిండేసే వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భయానకమైన ప్రకృతి విపత్తు .. వేలల్లో మరణాలు.. క్షతగాత్రుల ఆక్రందనలు.. ఊహకు కూడా అందని విషాదం మధ్య ఓ ఏడేళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకొని కూడా తమ్ముడిని కాపాడుకోవడానికి చేసిన పోరాటం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ బాలిక తమ్ముడిని కాపాడుకోవటం కోసం ఏం చేసింది? ఆ అక్కా తమ్ముళ్లు సురక్షితంగా బయటపడ్డారా? లేదా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరికి కలిగేలా చేసింది.
టర్కీ ప్రళయంలో మనసులను కదిలించే వీడియో, ఫోటో వైరల్
టర్కీ, సిరియాలో సంభవించిన తీవ్ర భూకంపాలు మరణ మృదంగాన్ని మోగించిన విషయం తెలిసిందే. అత్యంత భయానకమైన ప్రకృతి ప్రకోపం వల్ల ఇప్పటివరకు 8300 మందికిపైగా మరణించారు. దాదాపు 20,000 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక వేలాది భవనాలు కుప్పకూలగా, శిధిలాల కింద చిక్కుకున్నవారు ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో టర్కీ భూకంప ప్రళయానికి సంబంధించి మనసును కదిలించే ఒక ఫోటో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శిధిలాల క్రింద చిక్కి కూడా తమ్ముడిని కాపాడేప్రయత్నం చేసిన ఏడేళ్ళ సిరియన్ బాలిక
టర్కీలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాలను తొలగిస్తూ, వాటి కింద చిక్కుకున్న వారిని ఆసుపత్రికి తరలించి, ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులను కలచి వేస్తోంది. ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా, తన తమ్ముడికి రక్షణ కవచంలాగా తమ్ముడిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.

తమ్ముడి కోసం బాలిక ఏం చేసిందంట... వీడియో వైరల్
తమ్ముడు తలకు ఆ బాలిక చెయ్యిని అడ్డుపెట్టి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అంత ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితులలో కూడా ఓ అక్క తన తమ్ముడిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకంటే చిన్నవాడైన తమ్ముడికి ధైర్యం చెబుతూ, సహాయం కోసం ఎదురుచూసిన బాలిక, తమ్ముడిని కాపాడుకున్న తీరును కళ్ళకు కట్టినట్టు చూపించే ఓ చిత్రం, తమ్ముడి కోసం యువతి పడిన తాపత్రయం తాలూకా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రక్త సంబంధానికి అద్దంగా నిలుస్తున్న ఫోటో
అత్యంత కష్టతరమైన సమయంలో కూడా తమ్ముడు కోసం ఆ బాలిక చూపించిన తెగువ, ధైర్యం అందరినీ షాక్ గురిచేస్తున్నాయి. అంతే కాదు రక్త సంబంధానికి అద్దంగా నిలుస్తున్న ఈ ఫోటో మనలో తరిగిపోతున్న మానవీయ విలువలను తట్టి లేపుతోంది. ఇక ఈ వీడియోను, ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తమ్ముడిపై అక్కకు ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. అంత కష్టంలో కూడా చిన్నపిల్ల అయినప్పటికీ అక్క చూపించిన సాహసానికి ప్రశంసిస్తున్నారు.

17 గంటల తర్వాత శిధిలాల నుండి బయటపడిన అక్కాతమ్ముళ్ళు
తమ్ముడు పై ఆ అక్క ప్రేమను చూస్తే కళ్ళ నీళ్లు ఆగడం లేదని మరికొందరు స్పందిస్తున్నారు. అంతటి కష్ట సమయంలోనూ చాలా ధైర్యంగా ఉన్న ఆ బాలిక రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ బాలిక, తన తమ్ముడిని కాపాడుకుందా? తాను బయటపడిందా లేదా అని ఆందోళన పడుతున్న వారందరూ 17 గంటల పాటు శిధిలాల కిందనే ఇరుక్కుపోయిన అక్క తమ్ముళ్లు సురక్షితంగా బయటపడ్డారని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురి కాని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో!!












Click it and Unblock the Notifications