గని కుప్పకూలి 14 మంది మృతి.. పలువురికి సీరియస్..!
సౌతాఫ్రికాలోని ఓ గనిలో షాకింగ్ ఘటన జరిగింది. జోహన్నెస్ బర్గ్ నగరానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుస్టెన్ బర్గ్ లోని ఓ గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు గని కుప్పకూలిన ఘటనలో 14 మంది మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రావిన్షియల్ పోలీస్ కమిషనర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కుప్పకూలిన గని ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సౌతాఫ్రికాలో వేల సంఖ్యలో గోల్డ్, ప్లాటినమ్ మైన్స్ ఉన్నాయి. వాటిలోని అనేక మైనింగ్ కేంద్రాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదు. అయితే కొంతమంది అక్రమంగా ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ డిపాజిట్ల కోసం వారాలపాటు మైనర్లు అండర్ గ్రౌండ్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే గనులు కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు.

సౌతాఫ్రికాలో అక్రమ మైనింగ్ కీలకంగా మారుతోంది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం క్రిమినల్ సిండికేట్ లతో ముడిపడి ఉంటుంది. అక్రమ మైనింగ్ కోసం ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. గ్యాంగ్స్ లా మారి భీకరంగా యుద్ధాలు, ఘర్షణలు చేసుకుంటూ ఉంటారు. జోహన్నెస్ బర్గ్ లోని రుస్టెన్ బర్గ్ ప్రాంతం ప్లాటినమ్ మైనింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ ప్రపంచంలోనే అధిక సంఖ్యలో ప్లాటినమ్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే గని కుప్పకూలి ఈ విషాద ఘటన జరిగింది. గతంలోనూ సౌతాఫ్రికాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరిగాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో అక్రమ మైనింగ్ సిండికేట్ పై స్థానిక పోలీసులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications