అంతరిక్షంలోకి తొలి కాస్మోనాట్ ను పంపుతున్న SpaceX- అస్ట్రోనాట్ కూ, కాస్మోనాట్ కూ తేడా ఏంటి ?
ఒకప్పుడు పరిశోధనా సంస్ధలకే పరిమితమైన అంతరిక్ష ప్రయాణాన్ని సాధారణ జనానికి కూడా ప్రైవేటు సంస్ధలు అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి. స్పేస్ టూరిజం పేరుతో ట్రిప్ లు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో చేతిలో డబ్బుంటే చాలు ఇక అన్నా ఆయా సంస్ధలే చూసుకుంటున్నాయి. అయితే స్పేస్ టూరిజంతో పాటు పరిశోధనలకూ తెరదీస్తున్న ప్రైవేటు సంస్ధలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో రష్యాకు చెందిన కాస్మోనాట్ ను తొలిసారి ఎలాన్ మస్క్ సంస్ధ స్పేస్ ఎక్స్ అంతరిక్షానికి పంపుతోంది. మరో ముగ్గురు అస్ట్రోనాట్లతో కలిసి ఈ కాస్మోనాట్ అంతరిక్షానికి వెళ్లబోతున్నాడు.

స్పేస్ ఎక్స్ క్రూ 5 మిషన్
రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయటపడే ప్రణాళికలను ప్రకటించిన వారం రోజుల తర్వాత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పైస్ ఎక్స్ సంస్ధ .. ఓ రష్యన్ వ్యోమగామిని ఫ్లయింగ్ లాబొరేటరీకి ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి సెప్టెంబరు 29న అంతరిక్ష కేంద్రానికి తదుపరి మిషన్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎస్, రష్యా మధ్య నిరంతర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాస్కో సైనిక, అంతరిక్ష కార్యక్రమాలను విచ్ఛిన్నం చేయడానికి యూఎస్ కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఈ క్రూ 5 మిషన్ ను స్పేస్ ఎక్స్ ప్లాన్ చేసింది.

క్రూ 5 మిషన్ ప్రత్యేకతలివే
క్రూ 5 పేరుతో నిర్వహించే ఈ మిషన్ లో కమాండర్ నికోల్ మాన్, పైలట్ జోష్ కస్సాడా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) వ్యోమగామి కోయిచి వకాటా, మిషన్ నిపుణులుగా పనిచేసే రోస్కోస్మోస్ కాస్మోనాట్ అన్నా కికినా ఉన్నారు. మన్, కస్సాడా, కికినాలకు ఇది మొదటి అంతరిక్షయానం అయితే.. వాకాటాకు ఇది ఐదో యాత్ర కావడం విశేషం.ఫాల్కన్-9 రాకెట్‌లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఒక రష్యన్ కాస్మోనాట్ ఎక్కడం ఇదే మొదటిసారి. అలాగే ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్లు కలిసి ఇందులో ప్రయాణించబోతుండటం మరో విశేషం. క్రూ-5 మిషన్ ఫ్లయింగ్ లాబొరేటరీకి చేరుకున్న తర్వాత, అక్టోబర్‌లో ఇంటికి తిరిగి వచ్చే క్రూ-4 మిషన్ వ్యోమగాములు వారికి అప్పగిస్తారు.

క్రూ 5 మిషన్ ప్రయోగం నేపథ్యమిదే
ఈ మిషన్ ప్రయోగానికి ముందే స్పేస్ ఎస్క్ అధినేత ఎలాన్ మస్క్.. రష్యన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం రోస్కోస్మోస్ మాజీ చీఫ్ డిమిత్రి రోగోజిన్‌తో మాటలయుద్ధానికి దిగాడు. రష్యా అంతరిక్షంలోకి తన షటిల్ సేవలను నిలిపివేసిన తర్వాత.. "అంతరిక్షంలోకి ప్రవేశించడానికి యూఎస్ ట్రామ్పోలిన్‌ను వాడుకోవాల్సిందేనంటూ నాసాను అవమానించాడు. దీంతో అంతరిక్షంలోకి వ్యోమగాములను ప్రయోగించడానికి రష్యన్ సోయుజ్‌పై ఆధారపడింది. మస్క్ తన ఫాల్కన్ -9 సిబ్బంది మిషన్‌ను ప్రారంభించడంలో విజయం సాధించిన తర్వాత.. ట్రామ్పోలిన్ పని చేస్తుందని సరదాగా చెప్పాడు.

ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్ల మధ్య తేడా ఇదే
ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్లు రెండు పదాలు సమానంగానే అనిపిస్తున్నప్పటికీ వీటి మధ్య చాలా తేడా ఉంది.
ఇవి రెండు వేర్వేరు అంతరిక్ష సంస్థల యొక్క విభిన్న కార్యాచరణ ఆధారంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతరిక్షంలో పని చేయడానికి రష్యన్ స్పేస్ ఏజెన్సీ శిక్షణ తీసుకున్న వ్యక్తులు కాస్మోనాట్స్. కానీ ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో పని చేయడానికి NASA, ESA, CSA లేదా JAXA ద్వారా శిక్షణ తీసుకున్న వారు. అలాగే వీరిద్దరూ వాడే సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, వ్యవహరించే తీరు అన్నింటిలోనూ చాలా తేడాలు కనిపిస్తాయి. అయితే గతంలో వీరిపై అంత ఎక్కువగా చర్చ జరగకపోయినా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూఎస్, రష్యా మధ్య పెరిగిన అంతరంతో ఈ పదాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications