Abdul Ghani Baradar: ఆఫ్ఘన్ కొత్త అధ్యక్షుడెవరు?: కరడుగట్టిన తాలిబన్ల లీడర్‌షిప్ ఇదే
కాబుల్: ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మీదే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల వశం కావడాన్ని నివ్వెరపోయి చూస్తోన్నాయి ప్రపంచ దేశాలు. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్దిరోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ఇన్ని సంవత్సరాలు పాటు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియకుండా పోయిన తాలిబన్లు- అమెరికా అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా పడగ విప్పారు.
Recommended Video

పక్కా ప్లాన్..
రోజుల వ్యవధిలో దేశం మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు. ప్రభుత్వాన్ని కూలదోశారు. తమ సారథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. ఒక్క పూటలోనే రాజధాని కాబుల్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారంటే- వారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా? అనే పట్టుదలతో ఉన్న తాలిబన్లు- దీనికోసం పక్కా వ్యూహాన్ని రూపొందించుకోవడం.. దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారనేది ఇక్కడ స్పష్టమౌతోంది.

తాలిబన్ల నాయకత్వ స్ట్రక్చర్ ఎలా ఉంది..?
ఇంత పగడ్బందీగా ఓ దేశాన్ని స్వాధీనం చేసుకోవడమంటే మాటలు కాదు. పైగా రెండు దశాబ్దాలుగా ఆచూకీ తెలియని స్థితికి, ఉనికి కోల్పోయిన దశకు చేరుకున్న తరువాత కూడా తమకు ఎదురుగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోగానే.. విరుచుకుపడటం అనేది ఏ మాత్రం అంచనాలకు అందనిది. చివరికి- అమెరికా సైతం ఈ పరిణామాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తాలిబన్లకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అయ్యేదే. తాలిబన్ల బలమైన నాయకత్వం, కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పుణికి పుచ్చుకున్న లీడర్లు అతి కొద్దిమందే ఉన్నారు.

తాలిబన్ల సుప్రీం లీడర్ ఎవరు?
కరడుగట్టిన ఇస్లామిక్ అవుట్‌ఫిట్ తాలిబన్లకు హైబతుల్లా అఖుండ్జాదా నాయకత్వం వహిస్తోన్నాడు. ఇదివరకు తాలిబన్ అధినేతల వద్ద పని చేసిన అనుభవం అతనికి ఉంది. ఎక్కువగా తెరమరుగునే ఉంటాడు. వార్తల్లోకి ఎక్కడానికి పెద్దగా ఇష్టపడే మనస్తత్వం కాదు అతనిది. అమెరికా సైన్యం నిర్వహించిన డ్రోన్ల దాడిలో తాలిబన్ల చీఫ్ ముల్లా మన్సూర్ అఖ్తర్ దుర్మరణం పాలైన తరువాత.. 2016లో తాలిబన్ అధినేతగా అపాయింట్ అయ్యాడు. అప్పటి నుంచే హైబతుల్లా పేరు విస్తృతంగా వినిపిస్తోంది. మరో ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చీఫ్ అల్-జవహరికి అత్యంత విశ్వాసపాత్రునిగా హైబతుల్లాకు పేరుంది.

పొలిటికల్ చీఫ్ వింగ్ హెడ్.. అబ్దుల్ ఘనీ బరాదర్
తాలిబన్ల లీడర్‌షిప్ స్ట్రక్చర్‌లో మరో కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్. తాలిబన్ పొలిటికల్ వింగ్ చీఫ్ అతను. తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకడు. మూడేళ్ల కిందటే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అమెరికా విజ్ఞప్తి చేసిన తరువాతే.. పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌కు జైలు నుంచి విముక్తి కల్పించింది. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పటి సోవియట్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత 1979లో తాలిబన్‌కు ఏర్పాటైంది.

2010లో పాకిస్తాన్‌లో అరెస్ట్
తొలిసారిగా అబ్దుల్ ఘనీ బరాదార్ పేరు 2001లో విస్తృతంగా వినిపించింది. 2010లో అతణ్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మూడేళ్ల కిందటే విడుదలయ్యాడు. సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియలో భాగంగా అమెరికాతో ఒప్పందాలను కుదుర్చుకోవడం, అగ్రరాజ్యంతో చర్చల్లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషించింది బరాదరే. ఆఫ్గనిస్తాన్‌లోని ఒరుజ్గాన్ ప్రావిన్స్‌లో 1968లో జన్మించాడు. 1980 దశకంలో సోవియట్‌కు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ సంస్థలో పనిచేశాడు.

నెట్‌వర్క్ చీఫ్
తాలిబన్ల ఉప అధినేత వ్యవహరిస్తోన్నాడు సిరాజుద్దీన్ హక్కానీ. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడిన జిహాద్ కమాండ్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్. తాలిబన్ డిప్యూటీ లీడర్‌గా కూడా పని చేస్తోన్నాడు. హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ కూడా. ఈ నెట్‌వర్క్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇదివరకు ఆప్ఘనిస్తాన్‌ను పహారా కాసిన అమెరికా సైనిక బలగాలను తన నెట్‌వర్క్ సహాయంతో ముప్పతిప్పలు పెట్టాడని చెబుతుంటారు. మోస్ట్ డేంజరస్‌గా అతనికి గుర్తింపు ఉంది. 2014లో అమెరికా సైనికులు బోవె బెర్గ్‌డల్ సహా ఆప్ఘన్ పశ్చిమ ప్రాంతానికి చెందిన పలువురిని కిడ్నాప్ చేయడం వెనుక అతని హస్తం ఉన్నట్లు పాకిస్తాన్‌కు చెందిన డాన్ మీడియా పేర్కొంది.

ముల్లా ఒమర్ కుమారుడికీ కీలక పదవి..
తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకుబ్.. ప్రస్తుతం తాలిబన్‌లో కీలక పాత్ర పోషిస్తోన్నాడు. శక్తిమంతమైన మిలటరీ కమిషన్‌కు అతనే అధినేత. నిజానికి- 2016లో హైబతుల్లాకు బదులుగా ముల్లా యాకుబ్‌నే తాలిబన్లకు చీఫ్‌గా నియమించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది విఫలమైంది. ముల్లా యాకుబ్ అనుభవ లేమి.. అమెరికా వంటి బలమైన సైన్యంతో పోరాడే నైపుణ్యం లేకపోవడం వంటి కారణాల వల్ల అతను తాలిబన్ పగ్గాలను అందుకోలేకపోయాడు. అతని స్థానంలో హైబతుల్లా అపాయింట్ అయ్యాడు.

అతని మాటే ఫైనల్..
తాలిబన్ల లీడర్‌షిప్ కౌన్సిల్ చీఫ్‌గా ఉంటోన్నాడు రాహ్బరీ షురా. అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం షురా చెప్పిందే వేదం అవుతుంది. అతని మాటే ఫైనల్ అవుతుంది. ఎలాంటి కీలక నిర్ణయాలనైనా తీసుకోవడంలో షురా పాత్ర కీలకం. హైబతుల్లా అఖుండ్జాదా కూడా కీలక నిర్ణయాలను తీసుకోవడంలో రాహ్బరి షురాను సంప్రదింస్తాడని చెబుతుంటారు. అమెరికా సైన్యం.. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత.. ముల్లా ఒమర్ పాకిస్తాన్‌లో తలదాచుకోగా.. ఆ సమయంలో షురా.. అన్నీ తానై నడిపించాడని అంటుంటారు.












Click it and Unblock the Notifications