వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు
వంటింట్లో ముఖ్య పదార్ధంగా, సహజ ఔషధంగా వాడుకలో ఉంది వెల్లుల్లి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అద్భుతం పచ్చి వెల్లుల్లిని తరిగి, నలిపి లేదా ముక్కలు చేసి తీసుకున్నప్పుడు 'అలిసిన్' అనే సల్ఫర్ విడుదలవుతుంది. ఈ అలిసిన్ గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలిస్తుంది. వండినప్పటి కంటే పచ్చిగా తీసుకుంటేనే అలిసిన్ శరీరానికి ఉపయోగపడుతుంది. ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్.. శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
ఒకరకంగా వెల్లుల్లిని సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. రోజూ పచ్చి వెల్లుల్లితో దినచర్యను ప్రారంభించడం వల్ల గుండెకు ఎంతగానో మేలు. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. పచ్చి వెల్లుల్లి రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుందని, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ ఇది తక్కువ మోతాదులో తీసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

1. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది
గుండె సంబంధిత వ్యవస్థకు పచ్చి వెల్లుల్లి బలమైన మద్దతునిస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాలను బిగుతుగా చేసి ఒత్తిడిని పెంచే ఆంజియోటెన్సిన్‌కు సహజ నిరోధకంగా పనిచేస్తుంది. దీనివల్ల కాలక్రమేణా గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తపోటు ప్రమాదాలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి సమతుల్యమవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. దీంతో ధమనులు ప్లేక్ రహితంగా మారతాయి.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
జీర్ణవ్యవస్థకు పచ్చి వెల్లుల్లి అద్భుతమైన ప్రీబయోటిక్. ఇది ప్రేగులలోని ప్రయోజనకర బ్యాక్టీరియాకు ఆహారంగా మారి, ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా ఒత్తిడి వల్ల దెబ్బతిన్న మైక్రోబయోమ్‌కు సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం తగ్గి, మలబద్ధకం లేకుండా, పోషకాలు మెరుగ్గా శరీరానికి అందుతాయి. పచ్చి వెల్లుల్లిలోని సహజ ఎంజైమ్‌లు కడుపులో జీర్ణ రసాలను ప్రేరేపించి, మలబద్ధకం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సాధారణ సమస్యలను చికాకు లేకుండా నివారిస్తాయి.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పచ్చి వెల్లుల్లిలోని అలిసిన్ శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలతో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పచ్చిగా తిన్నప్పుడు బాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లతో సమర్థవంతంగా పోరాడుతుంది. తెల్ల రక్త కణాలు చురుకుగా మారి, ఫ్లూ సీజన్‌లు లేదా కాలుష్యం నుండి రక్షణ కవచంగా పనిచేస్తాయి.
4. యాంటీఆక్సిడెంట్ రక్షణ
కణాలను దెబ్బతీసి, వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే హానికర ఫ్రీ రాడికల్స్‌ను పచ్చి వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు తటస్థీకరిస్తాయి. డైయాలిల్ డైసల్ఫైడ్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కాలేయం, మెదడు, చర్మం వంటి ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ముడిపడిన మంటను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతమౌతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
5. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
పచ్చి వెల్లుల్లి కాలేయం నిర్విషీకరణ ప్రక్రియలకు తోడ్పడుతుంది. ఈ సహజ శుద్ధీకరణ రక్తం నాణ్యత, కళ్ళు, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి రెబ్బను నలపడం వల్ల కాలుష్య కారకాలను బంధించి సులభంగా తొలగించే సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇది శరీరం అంతర్గతంగా శుభ్రపడటానికి సహాయపడి, మొత్తం శరీర ఆరోగ్యం, జీవక్రియలకు చాలా ముఖ్యం.
6. రక్తంలో చక్కెర నియంత్రణ
పచ్చి వెల్లుల్లి వల్ల ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ జీవక్రియ మెరుగుపడుతుంది. ప్రీడయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక. కణాలు చక్కెరను ఎలా ఉపయోగిస్తాయో మెరుగుపర్చి, రక్తంలో చక్కెరలో అకస్మాత్తుగా ఉండే హెచ్చుతగ్గులను నివారిస్తుంది. పచ్చి వెల్లుల్లి రక్తాన్ని తేలికగా పలుచబరచి, గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే ఫైబ్రినోలిటిక్ ను పెంచుతుంది. ఇది రక్తం సురక్షితంగా ప్రవహించేలా చేసి, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.












Click it and Unblock the Notifications