Saikrishna Case: సీబీఐకి సాయికృష్ణ కేసు ?- హైకోర్టు తీర్పు రిజర్వ్ వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలోని విజయవాడలో 3 నెలల క్రితం తీవ్ర సంచలనం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో (Saikrishna Case) ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును తమకు బదిలీ చేసేలా నిన్న ఆదేశాలు ఇచ్చిన అత్యున్నత న్యాయస్దానం.. ఇవాళ మాత్రం సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు నిర్ణయం ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇప్పటికే ఏపీ హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న తీరు చూస్తుంటే సీబీఐకి ఇస్తారన్న నమ్మకం లేదంటూ సాయికృష్ణ తల్లి చెబుతోంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది.

సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ కేసులో కింది కోర్టులో సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. దీని ఆధారంగా హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించకుంటే, సుప్రీంలో కేసు విచారణకు అభ్యర్థిస్తామని సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ తెలిపారు. దీంతో
హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా సీబీఐ విచారణపై తేల్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 26కు వాయిదా వేసింది. సాయికృష్ణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించని పక్షంలో, తాము జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఏపీలో సాయికృష్ణ కేసు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు సాయికృష్ణను ఓ పాడుబడిన భవంతికి తీసుకెళ్లి చంపేశారని సిట్ తమ ఛార్జిషీట్ లో పేర్కొంది. దీని ఆధారంగా ఈ కేసులో తదుపరి దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తుందని అంచనా వేస్తున్నారు. అలా కాని పక్షంలో సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.














Click it and Unblock the Notifications
