Afghanistan: తాలిబన్ల అరాచకానికి పరాకాష్ఠ... క్రిస్టియన్ వ్యక్తి చర్మం ఒలిచి స్తంభానికి వేలాడదీశారు...
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మాటలకు వారి చేతలకు అసలు పొంతనే లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరినీ శత్రువుల్లా భావించమని,కక్ష సాధింపు చర్యలు ఉండవని తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. కానీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. అమెరికా మాజీ కాంగ్రెస్ నేత మార్క్ వాకర్ తాజాగా అమెరికన్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ల అరాచకాల గురించి వెల్లడించారు.
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మార్క్ వాకర్ పేర్కొన్నారు.'ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న దారుణాల గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఓ క్రిస్టియన్ వ్యక్తిని తాలిబన్లు చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. అతని చర్మం ఒలిచి స్తంభానికి వేలాడదీశారని అంటున్నారు.' అని మార్క్ వాకర్ పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యుల ముందే తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.

తాలిబన్ల పాలనలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని... మిలటరీతోనూ తమకెలాంటి శత్రుత్వం లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. కానీ సైనికులను పట్టుకునేందుకు ఇంటింటికీ తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాలను వేధింపులకు,హింసకు గురిచేస్తున్నారు. వారి కూతుళ్లను తమతో పంపించాలని... తమకిచ్చి పెళ్లిళ్లు చేయాలని తాలిబన్లు ఆ కుటుంబాలను వేధిస్తున్నారు. కొన్నిచోట్ల యువతులను చెక్క పెట్టెల్లో నిర్బంధించి సెక్స్ బానిసలుగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
మహిళా జర్నలిస్టులను ఇప్పటికే ఆయా మీడియా సంస్థలు ఇంటికి పంపించేశాయి. తాలిబన్ల పాలనలో మహిళల రాజకీయానికి తావు లేదని ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి అర్థమైంది. స్వేచ్చ,హక్కులు మృగ్యమైన చోట ప్రస్తుతం తాలిబన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏ తాలిబన్ తుపాకీ తమను ఎక్కుపెడుతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నా... ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి వారిని తరలించడం అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్,అమెరికాకు చెందిన వందలాది మంది కాబూల్‌లోనే చిక్కుకుపోయి ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కాబూల్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లను వెనక్కి తీసుకొస్తామని జో బైడెన్ ప్రకటించినప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులువైనదేమీ కాదన్నారు. పైగా అంతిమ ఫలితంపై తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పారు. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి విముక్తి అయ్యాయి. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పంజ్‌షేర్ కేంద్రంగా తాలిబన్లను ఎదుర్కొనే వ్యూహాలు రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications