షాపింగ్ మాల్‌లో యథేచ్ఛగా కాల్పులు- ఎనిమిది మంది దుర్మరణం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ నిత్యకృత్యమైంది. వరుస కాల్పుల ఘటనలు నమోదవుతున్నాయి. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. దీనికి బ్రేకులు పడట్లేదు. ఏదో ఒక ప్రాంతంలో తుపాకీ పేలుతూనే ఉంది. జనం ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 198 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజాగా మరోసారి అలాంటి దిగ్భ్రాంతికర ఘటనే సంభవించింది. టెక్సాస్‌లో గుర్తు తెలియని వ్యక్తి జనంపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం- డల్లాస్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు- ఆ దుండగుడిని కూడా కాల్చి చంపారు. టెక్సాస్ స్టేట్‌లోని ఢల్లాస్ శివార్లలో గల అల్లెన్ టౌన్‌లో ఈ ఘటన సంభవించింది. లక్షమందికి పైగా నివాసం ఉండే టౌన్ ఇది. ఇక్కడి అల్లెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
మాల్ సెక్యూరిటీ కళ్లు గప్పి తుపాకీతో లోనికి ప్రవేశించిన కొద్దిసేపటి తరువాత యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. రక్తపాతానికి ఒడిగట్టాడు. పెద్ద ఎత్తున బుల్లెట్ల శబ్దం వినిపించింది. సంఘటన స్థలం మొత్తం రక్తసిక్తమైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అల్లెన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం దుండగుడు ఎక్కడ ఉన్నాడనేది పసిగట్టారు. చాకచక్యంగా లోనికి ప్రవేశించిన పోలీసులు అతణ్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది సంఘటన స్థలంలోనే మరణించారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని మెడికల్ సిటీ హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించామని, చికిత్స అందిస్తోన్నామని అల్లెన్ పోలీస్ చీఫ్ బ్రియాన్ హార్వే తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని అన్నారు.
ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి సత్వరమే అత్యవసర వైద్య చికిత్సను అందిస్తోన్నామని తెలిపారు. సెక్యూరిటీ లోపాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడే ప్రదేశాల వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications