H-1B Visa: భారతీయ కంపెనీల టార్గెట్..! ట్రంప్ తాజా షాకులు ..!
అమెరికాలో విదేశీయుల్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు అక్కడి భారతీయ నిపుణులతో పాటు కంపెనీలకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయుల హవాను నియంత్రించేందుకు హెచ్1బీ వీసాల విధానంలో ట్రంప్ తెచ్చిన మార్పులతో అక్కడి సాధారణ ప్రజల్లోనూ మనోళ్లపై వ్యతిరేకత అంతకంతకూ తీవ్రమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అమెరికాలో భారతీయ కంపెనీలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి.
అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ దూకుడుగా ముందుకెళ్తున్న విధానం అక్కడి సామాన్యుల్లో సైతం భారతీయులపై వ్యతిరేకత పెంచుతోంది. అమెరికాలో భారీ స్ధాయిలో స్ధిరపడ్డ విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉండటం, అలాగే అక్కడి భారతీయ కంపెనీలు తమ దేశానికి చెందిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో స్ధానికంగా ఊహించని వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. హెచ్1బీ వీసా విధానంలో వస్తున్న మార్పులతో ఇది బయటపడుతోంది.

హెచ్1బీ వీసా విధానంలో ట్రంప్ తెచ్చిన మార్పులు వచ్చే రెండు నెలల్లో పూర్తి స్దాయిలో అమల్లోకి రాబోతున్నాయి. దీంతో అమెరికన్ కంపెనీలతో పాటు అక్కడ పాగా వేసిన భారతీయ కంపెనీలు సైతం వీసాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితి. లేకపోతే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవు. ఇన్నాళ్లు మనోళ్లే కదా అని భారతీయులకు ప్రాధాన్యం ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు తప్పనిసరిగా రూటు మార్చుకోవాల్సిన పరిస్ధితి ఎదురుకాబోతోంది.

భారతీయులు నడుపుతున్న ఫెడెక్స్, వాల్ మార్ట్, వెరిజోన్ అమెరికన్ కంపెనీలను నియామకాల విషయంలో ఆన్ లైన్ లో యూజర్లు టార్గెట్ చేస్తున్నారు. ఆయా కంపెనీలు భారతీయ కార్మికులకు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలను అమ్ముతున్నాయని సోషల్ మీడియా యూజర్లు ఆరోపించారు. ఇందులో కొన్ని దాడులు వ్యవస్థీకృత ప్రచారాలలో భాగంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి రుణాలు పొందిన భారతీయ అమెరికన్ వ్యవస్థాపకులను పక్కా సమన్వయంతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా విశ్లేషణ ప్రకారం దక్షిణాసియా సమాజాలపై హింస, బెదిరింపులు గత నవంబర్‌లో 12 శాతం పెరిగాయి. అలాగే ఆన్‌లైన్‌లో దూషణల వాడకం 69 శాతం పెరిగింది.












Click it and Unblock the Notifications