Turkey Earthquake:భూకంపం మిగిల్చిన విషాదం..హృదయ విదారక వీడియోలు..!
టర్కీలో సంభవించిన భూకంపంతో ఎంతో మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. వారిని సహాయక బృందాలు కాపాడుతున్నాయి. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టర్కీ సిరియా దేశాలను వరుస భూకంపాలు కుదిపేశాయి. ముఖ్యంగా టర్కీపై ప్రకృతి పగబట్టినట్లుగా కనిపించింది. ఎటు చూసినా మృతదేహాలు. శిథిలాల కింద కాపాడండి అంటూ వినిపించే ఆర్తనాదాలతో అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి. ఎంతో గొప్పగా వెలుగొందిన టర్కీ దేశం ఇప్పుడు స్మశానంగా మారింది. భూకంపం ధాటికి భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ శిథిలాల కింద ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం చాలా వేగవంతంగా జరుగుతున్నాయి.
పలు ప్రపంచ దేశాలు ఈ కష్ట సమయంలో టర్కీని ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఇక టర్కీలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తును పలువురు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ద్వారా ప్రపంచానికి ఎన్నో కన్నీటి గాధలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజెన్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. భగవంతుడు వీరి పట్ల కరుణ చూపాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. టర్కీ కన్నీటిగాథకు సంబంధించిన వీడియోలు మీకోసం.
స్మశానంగా మారిన సల్కిన్ నగరం
సోమవారం టర్కీ సిరియా దేశాలు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారి భూమి కంపించింది. దీంతో చాలామంది శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బయట ఎముకలు కొరికే చలి. ఎటు చూసిన మంచుతో మునిగిన నగరాలు. చాలామంది శిథిలాల కిందే ఆహాకారాలు చేస్తూ ఉండిపోయారు. ఇక బతుకుతామన్న ఆశ కూడా మిగలలేదు. ఒక్కసారే అనుకుంటే పుండు మీద కారం చల్లినట్లు భూమి పలుమారు కంపించింది.
కొన్ని వేల మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు వదిలారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరిని ఈ భూకంపం కబళించింది. ఇదిగో ఇక్కడ ఓ రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని ఎలా కాపాడిందో చూడండి.సల్కిన్ నగరంలో సోమవారం సాయంత్రం కనిపించిన దృశ్యమిది.
చిన్నారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది
భూకంపం ధాటికి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల కింద ఓ చిన్నారి చిక్కుకుంది. తల్లిదండ్రులు సగం కూలిన ఇంటిలోని మూడవ అంతస్తులో ఉన్నారు.ఈ దృశ్యం అలెప్పోలో కనిపించింది.వీరిని అర్థరాత్రి సమయంలో సహాయక బృందాలు గుర్తించి కాపాడాయి.
40 గంటలు శిథిలాల కిందే..
సల్కిన్ నగరంలో భూకంపం ధాటికి ఓ చిన్నారి శిథిలాల కింద చిక్కుకుంది.దాదాపుగా బయటి ప్రపంచాన్ని చూసేందుకు ఆ చిన్నారికి 40 గంటల సమయం పట్టింది. భగవంతుడు ఆమె పట్ల చల్లని చూపు చూడటంతో ప్రాణాలతో బయటపడింది. కానీ 40 గంటలు శిథిలాల కింద ఆ చీకటిలోనే తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ కాలం వెల్లదీసింది. ఈ వీడియో పలువురిని కలచివేసింది.
మొత్తానికి టర్కీ దేశంలో సంభవించిన ఈ పెను భూకంపం ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. మరెందరినో అనాథలుగా చేసింది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయి సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కష్ట సమయంలో భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు టర్కీకి అండగా నిలిచాయి. మళ్లీ అందమైన టర్కీ నగరం సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications