నదిలో పడిన రెండు బస్సులు..66 మంది గల్లంతు!
ఇవాళ తెల్లవారుజామున నేపాల్‌లోని మదన్ -ఆశ్రిత్ హైవేలో ఘోరప్రమాదం జరిగింది. నేపాల్‌లో కొండచరియలు విరిగిపడడంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా మొత్తం 66మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు బస్సులలో ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి బయలుదేరి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి (శుక్రవారం) తెల్లవారుజాము ఉదయం మూడు గంటల సమయంలో సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో ఆ రెండుబస్సులు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి ఖిమా నంద భుసాల్ తెలిపారు. ఆ రెండు బస్సులలోని ఓ బస్సులో 24మంది ప్రయాణికులు ఉండగా, మరో బస్సులో 41మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు వివరించారు.

గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం వాటిల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌లో వర్షాకాలం జూన్ మాసంలో మొదలై సెప్టెంబర్ మాసంలో ముగుస్తుంది. ఈ సమయంలో ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో సాధారణంగానే ఇక్కడ పరిస్థితి కొంచెం భయానంగానే ఉంటుంది. విరివిగా కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి. అయితే, ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications