ఉత్తర కొరియాలో ఘోరం- సినిమాలు చూశారని టీనేజ్ స్టూడెంట్స్‌ను కాల్చి చంపారు..!!
ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్.. ఆ పేరుకు తగ్గట్టే వ్యవహరించారు. సినిమాలు చూశారనే కారణంతో ఇద్దరు విద్యార్థులను దారుణంగా కాల్చి చంపించారు. బహిరంగంగా వారికి మరణశిక్షను అమలు చేశారాయన. ఈ ఉదంతం పట్ల పలు దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. కిమ్ జొంగ్ చర్యల పట్ల దక్షిణ కొరియా అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఉత్తర కొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనాతో సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ ప్రావిన్స్. ఓ హైస్కూల్‌లో దక్షిణ కొరియా, అమెరికన్ సినిమాలు నాటక ప్రదర్శనలను వీక్షించారు ఇద్దరు టీనేజర్లు. వారి వయస్సు 16, 17 సంవత్సరాలు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ విషయం కిమ్ జొంగ్ దృష్టికి వచ్చింది. దీనితో ఆయన వారికి మరణశిక్షను విధించారు. బహిరంగంగా అమలు చేయాలని ఆదేశించారు. హైసన్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌లో సైన్యాధికారులు ఈ శిక్షను అమలు చేశారు. కిమ్ జొంగ్ నుంచి ఆదేశాలు అందిన కొన్ని గంటల వ్యవధిలో దాన్ని అమలు చేశారు. టీనేజర్లను బహిరంగంగా మరణశిక్ష విధించారు. స్థానికులు చూస్తోండగా కాల్చి చంపారు.
ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, నాటకాల ప్రదర్శనపై నిషేధం ఉంది. దక్షిణ కొరియాకు చెందిన సినిమాలు, ప్రదర్శనలు, స్టేజ్ షోలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్.. వంటి కార్యక్రమాలకు ఇదివరకు ఉత్తర కొరియాలో పెద్ద ఎత్తున జనాదరణ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని నిషేధించింది ఉత్తర కొరియా ప్రస్తుత ప్రభుత్వం. వాటిని ప్రదర్శించడమే కాదు.. చూసినా కూడా నేరంగానే పరిగణించేలా చట్టాలను రూపొందించింది.
తాజాగా ఇద్దరు టీనేజర్లు దక్షిణ కొరియా, అమెరికన్ సినిమాలు, స్టేజ్ షోలను చూశారు. వాటిని తమ స్నేహితులకు షేర్ చేశారు. దాన్ని నేరంగా పరిగణించింది. టీనేజ్‌లో నేరం చేయడం వల్ల అది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని భావించింది. అందుకే ఆ ఇద్దరు విద్యార్థులను బహిరంగంగా మరణశిక్షను అమలు చేసింది. చిన్న వయస్సులో చట్టాలను ఉల్లంఘించడానికి అలవాటుపడతారని ఉత్తర కొరియా ప్రభుత్వం భావించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ఉత్తర కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా అమలువుతాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోందని పేర్కొంది. ఇదివరకు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియాలో గత ఏడాది 11 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఆ సమయంలో పౌరులు నవ్వడాన్ని కూడా నిషేధించారు. షాపింగ్ చేయడానికి, మద్యం సేవించడానికీ అనుమతి ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications