తెలుగువారిపై తెల్లోళ్ల దాడి! దసరా వేడుకల్లో చిందిన రక్తం
సుదూర ప్రాంతంలో స్థిరపడినప్పటికీ, మన సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా నిర్వహించుకుంటున్న తెలుగు సమాజానికి బ్రిటన్‌లో చేదు అనుభవం ఎదురైంది. దసరా, బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్న సమయంలో కొందరు ఆకతాయిలు జాత్యహంకారంతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక భారతీయులను, ముఖ్యంగా తెలుగు వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఒస్సెట్ టౌన్ హాల్ వేదికగా స్థానిక తెలుగు హిందూ సంఘాలు దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో సుమారు 25 మంది బ్రిటీష్ యువకులు ఈ-బైక్‌లపై వచ్చి హాల్ వద్ద గొడవ చేసేందుకు యత్నించారు. లోపల ఏం జరుగుతోంది, ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తూ.. హాల్‌లోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని చాకచక్యంగా అడ్డుకుని బయటకు పంపేశారు.

కార్ పార్కింగ్ వద్ద మాటు వేసి దాడి!
లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో సదరు ఆకతాయి గుంపు బయటే కాపుకాశారు . రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన మిత్రుడితో కలిసి వేడుక ముగించుకుని పార్కింగ్ చేసిన కార్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే ముఖాలకు మాస్కులు ధరించి ఉన్న 8 నుంచి 10 మంది బ్రిటీష్ యువకులు వీరిని చుట్టుముట్టారు. "ఇక్కడేం చేస్తున్నారు?" అని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగారు. గొడవ వద్దనుకుని వారు తిరిగి టౌన్ హాల్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి పిడిగుద్దులతో దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాద్ వ్యక్తి ముఖానికి, కంటికి తీవ్ర గాయాలవ్వగా.. ఆయన మిత్రుడి తలకు, చేతికి తీవ్ర రక్తస్రావమైంది.
సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
ఈ ఘటనపై స్థానిక హెచ్‌డీఆర్ ప్రదేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడిని జాత్యహంకార కోణంలోనే విచారిస్తున్నట్లు వెల్లడించారు. హిందూ సమాజంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించిందని, నిందితులను వదిలేది లేదని ఇన్ స్పెక్టర్ ఆండ్రూ డికిన్సన్ తెలిపారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.














Click it and Unblock the Notifications
