వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైరియన్ వైట్: ఇమ్రాన్ ఖాన్ రహస్య కుమార్తె వ్యవహారం ఆయన రాజకీయ జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నామినేషన్ పత్రంలో కొడుకుల పేర్లు ప్రస్తావించారు గానీ, తనకు టైరియన్ వైట్ అనే కూతురు ఉందన్న సంగతిని రహస్యంగా దాచిపెట్టారని ఇస్లామాబాద్ హైకోర్టులో సాజిద్ మహ్మూద్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌పై జనవరి 27 లోగా ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వాలని గత గురువారం కోర్టు ఆదేశించింది.

ఈ జవాబు కాపీని పిటిషనర్‌కు కూడా ఇవ్వాలని ఇమ్రాన్‌ఖాన్‌ తరపు న్యాయవాది సల్మాన్‌ అక్రమ్‌ రజాకు తెలిపింది.

గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ అటార్నీ జనరల్ సల్మాన్ అస్లాం బట్ మొదటిసారి పిటిషనర్ తరపున న్యాయవాదిగా కోర్టుకు హాజరయ్యారు.

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హయాంలో సల్మాన్ అస్లాం బట్ అటార్నీ జనరల్‌గా ఉన్నారు. గతంలో పలు కేసుల్లో షరీఫ్ కుటుంబం తరపున న్యాయవాదిగా వ్యవహరించారు.

ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని ఇమ్రాన్ ఖాన్ తొలుత సమాధానం ఇచ్చారు. అయితే ఆ పత్రాలపై ఆయన వేలిముద్ర లేదని ఇస్లామాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం గురువారం విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

తన క్లయింట్‌కు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని, అందుకే వేలిముద్ర తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఇమ్రాన్‌ ఖాన్‌ తరపు న్యాయవాది సల్మాన్‌ అక్రమ్‌రాజా కోర్టుకు తెలిపారు.

దానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ నవ్వుతూ, "వేలిముద్ర తీసుకోవడానికి టైం పడుతుందా? ఈరోజుల్లో ప్రతిదానికీ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు. మొబైల్ దుకాణంలో కూడా బయోమెట్రిక్స్ ఉంటాయి. బయోమెట్రిక్స్ మిషన్ నుంచి రసీదు తీసుకుని దాన్ని సమాధాన పత్రానికి జత చేసి ఇవ్వండి. మీకు, మీ క్లయింట్‌కు ఉన్న బలంతో బయోమెట్రిక్స్ మిషన్‌నే మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు" అన్నారు.

పిటిషన్ ఎందుకు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు?

టైరియన్ వైట్ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఆ పిటిషన్ విచారణ యోగ్యం కాదని సల్మాన్ అక్రమ్ రజా గురువారం కోర్టులో వాదించారు.

తన క్లయింట్ ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ సభ్యుడు కారు, ఏ పదవిలోనూ లేరు కాబట్టి ఈ పిటిషన ఆమోదయోగ్యం కాదని అన్నారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ అసెంబ్లీలో లేకపోయినా, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత అని పిటిషనర్ సాజిద్ మహ్మూద్ తరపు న్యాయవాది వాదించారు.

ఇమ్రాన్ ఖన్ దీనిపై మధ్యంతర జవాబు ఇవ్వాలనుకుంటున్నారని అక్రమ్ రజా కోర్టును కోరగా, జనవరి 27 వరకు కోర్టు గడువు ఇచ్చింది. అలాగే జవాబు కాపీని పిటిషనర్ తరపు న్యాయవాదికి కూడా అందించాలని ఆదేశించింది.

గతంలో ఇలాంటి పిటిషన్ కొట్టివేశారు

గతంలో ఇమ్రాన్ ఖాన్‌పై ఇలాంటి పిటిషన్ ఒకటి దాఖలైంది. ఇస్లామాబాద్ హైకోర్టులోని ఇద్దరు న్యాయముర్తుల ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపితే, దాని ప్రభావం ఆ అమ్మాయి హక్కుల మీద పడుతుందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి అత్‌హర్ మినల్లా అన్నారు.

విచారణ సమయంలో పలు ఇస్లామిక్ అంశాలు తెరపైకి రావచ్చు. దీనికి సంబంధించి మీడియాలో రిపోర్టులు వస్తాయి. అదంతా ఆ అమ్మాయి హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జడ్జి అన్నారు.

టెరియన్ వైట్ స్వయంగా వచ్చి అర్జీ పెట్టుకుంటే కోర్టు విచారణ జరుపుతుందని చెప్పారు.

అయితే, ప్రస్తుత పిటిషన్‌పై గత కొన్ని నెలలుగా విచారణ వేగవంతం చేయడాన్ని చూస్తుంటే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చూస్తున్నట్టు అనిపిస్తోందని న్యాయ నిపుణుడు, పాకిస్తాన్ బార్ కౌన్సిల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్జద్ షా అనారు.

ఈ పిటిషన్ వల్ల రానున్న రోజుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు సమస్యలు ఉత్పన్నమవుతాయని అమ్జద్ షా అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్‌ఖాన్‌ చిక్కుల్లో పడతారా?

ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాల నేపథ్యంలో, ఈ అంశాన్ని కొత్తగా మళ్లీ ఎందుకు లేవనెత్తారన్న సందేహాలు వినిపిస్తున్నాయి?

ఈ అంశంలో న్యాయపరమైన చిక్కులు తక్కువగా, రాజకీయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అబిద్ సాకీ అంటున్నారు.

"దురదృష్టవశాత్తు చట్టం ముసుగులో రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది" అని ఆయన అన్నారు.

సాధారణంగా ఇలాంటి కేసులు కోర్టులకు రాకూడదని, వ్యక్తిగత విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇలాంటి దరఖాస్తులపై విచారణ చేయడం న్యాయస్థానాలకు మంచిది కాదని అబిద్ సాకీ అన్నారు.

'ఇమ్రాన్‌కు ఎలాంటి రాజకీయ ముప్పు లేదు'

"దేశంలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించవచ్చు, కానీ ఆయన రాజకీయ జీవితాన్ని ముగించలేరు" అని జర్నలిస్ట్, విశ్లేషకుడు మజర్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు.

"కొందరికి కొన్ని రాజకీయ ప్రయోజనాలు చేకూరవచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ అంగీకరించరు" అని ఆయన అన్నారు.

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కూడా అనర్హత వేటు వేశారని, అయితే పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ మద్దతుదారులు దాన్ని ఈనాటికీ అంగీకరించలేదని మజార్‌ అబ్బాస్‌ అన్నారు.

"ఇందులో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా వివాదాస్పదంగా ఉంది. రాజకీయ నాయకులు పరస్పర విరోధంతో, రాజకీయ ప్రయోజానాల కోసం న్యాయస్థానం మెట్లు ఎక్కకుండా పార్లమెంటులో చట్టం తీసుకురావాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయినప్పటి నుంచి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఎదుర్కుంటూనే ఉన్నారని, ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు తెలుసునని మియాన్‌వాలి నుంచి పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు అమ్జాద్ ఖాన్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్

పిటిషనర్లు ఎవరు? వారు ఎందుకు అజ్ఞాతంగా ఉన్నారు?

ఇమ్రాన్ ఖాన్‌పై పిటిషన్ వేసిన సాజిద్ మహ్మూద్ ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు.

పిటిషనర్ తరపు న్యాయవాది జనరల్ సల్మాన్ అస్లాం బట్ ఈ అంశంపై స్పందిస్తూ, తాను పిటిషనర్‌కు ప్రతినిధిగా న్యాయస్థానంలో వాదిస్తున్నందున, పిటిషనర్ కోర్టు గదిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మొదటిసారి ఈ కేసులో న్యాయవాదిగా వ్యహరిస్తున్నందున, పిటిషనర్ గురించి ఎక్కువ వివరాలు తెలుపలేనని అన్నారు.

పిటిషనర్‌కు కోర్టు సమన్లు ​​పంపినప్పుడు కోర్టుకు హాజరవుతానని చెప్పారు.

పిటిషనర్ ఎవరో తమ పార్టీకి తెలియాల్సిన అవసరం లేదని, పిటిషనర్ పట్ల తమకు ఆసక్తి లేదని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత అమ్జద్ అలీ ఖాన్ అన్నారు.

"ఇలాంటి పిటిషన్లు అనేకం ఫైల్ అవుతాయి. కానీ, పిటిషనర్లు ఎవరూ ముందుకు రారు. వీటి ఉద్దేశం బురద జల్లడమే" అని ఆయన అన్నారు.

'ఇలాంటి విషయాలు కోర్టుకు వెళ్లకూడదు'

ఇమ్రాన్ ఖాన్ టైరియన్‌ను తన కుమార్తెగా అంగీకరించకపోవడం విచారకరమని పాకిస్తాన్ పాలక కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ సభ్యుడు చౌదరి బషీర్ వార్క్ అన్నారు.

"ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారి గురించి సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. వారి వీశ్వసనీయతను సవాలు చేసే హక్కు వారికి ఉంది. కానీ, ఇలాంటి వ్యవహరాలు కోర్టుకు వెళ్లకూడదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం రాజకీయ విజయంగా భావించే పరిస్థితికి రోజులు దిగజారాయి" అని బషీర్ వార్క్ అభిప్రాయపడ్డారు.

సీతా వైట్ ఎవరు?

2004లో 43 ఏళ్ల బ్రిటిష్ పౌరురాలు సీతా వైట్ అమెరికాలో మరణించినప్పుడు బ్రిటిష్ వార్తాపత్రిక 'ది మిర్రర్', అమెరికా వార్తాపత్రిక 'ది న్యూయార్క్ పోస్ట్' ఆమె గురించి రాస్తూ, ఆమె పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రియురాలు అని వెల్లడించాయి.

ఆ కథనాల ప్రకారం, సీత ఒక పాపకు జన్మనిచ్చారు. ఆమె పేరు టైరియన్ వైట్. ఆమె ఇమ్రాన్ ఖాన్ కూతురని అంటున్నారు.

సీతా వైట్ కాలిఫోర్నియాలో శాంతా మోనికలో యోగా క్లాసులో చనిపోయారని పత్రికలు తెలిపాయి.

మరణానికి కొన్ని రోజుల ముందే, ఆమె తన తండ్రి ఆస్తిలో మూడు మిలియన్ డాలర్ల వాటా కోర్టు ద్వారా పొందారు. ఈ కేసులో ఆమె ఎనిమిదేళ్లు పోరాటం చేశారు.

సీతా వైట్ యోగా టీచర్‌గా పనిచేసేవారు.

ఇవి కూడా చదవండి:

English summary
Tyrion White: Will Imran Khan's Secret Daughter Put His Political Career In Trouble?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X