హెచ్1బీ వీసా పాలసీలో అమెరికా భారీ మార్పులు-లాటరీ రద్దు- జీతం, నైపుణ్యాలే ప్రామాణికం
విదేశీ నిపుణుల నియామకం కోసం అమెరికా ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్1బీ వీసాల విధానంలో మరోసారి మార్పులు తప్పేలా లేవు. తాజాగా అధికారంలోకి వస్తున్న జో బైడెన్ సర్కారు ఇకపై వీసాల జారీ కోసం కొత్త ప్రామాణికాలను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకూ లాటరీ విధానంలో సాగుతున్న ఈ వీసాల జారీని ఇకపై జీతాలు, నైపుణ్య స్ధాయిల ఆధారంగా చేయబోతున్నారు.
అమెరికాలో ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను పరిరక్షించడం, తాత్కాలిక ఉపాధి కల్పించడం ద్వారా విదేశీ నైపుణ్య కార్మికుల సేవలు తీసుకోవడం ఈ కొత్త విధానం లక్ష్యంగా కనిపిస్తోంది. H-1B వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది సిద్ధాంతపరమైన, సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులు నియమించడానికి అమెరికా, ఇండియా, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించడానికి సాంకేతిక సంస్థలకు అవకాశం ఉంటుంది.

H-1B క్యాప్ ఎంపిక ప్రక్రియ సవరణ వల్ల ఎక్కువ జీతాలు లేదా అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడానికి సంస్ధల యజమాన్యాలను ప్రోత్సహించనుంది. మారుతున్న పరిస్ధితుల ఆధారంగా అంతర్జాతీయ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునే వీలు కల్పిస్తుందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెబుతోంది. తాజా మార్పుల ఆధారంగా రూపొందించిన హెచ్1బీ వీసా విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజా విధానం H-1B రెగ్యులర్ క్యాప్‌తో పాటు H-1B అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు రెండింటికీ అమలు చేయనున్నారు.