UAE Visa: మారిన దుబాయ్ వీసా రూల్స్! జులై 9 లోగా దేశాన్ని వీడాల్సిందే..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటక, సందర్శక వీసాలపై ఉంటూ.. గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన (Overstay) విదేశీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గతంలో విమాన సర్వీసుల అంతరాయం కారణంగా ప్రకటించిన ప్రత్యేక మినహాయింపు గడువు ముగిసిందని, అర్హులైన వారు జులై 9 లోగా తమ వీసా స్టేటస్‌ను సరిచేసుకోవాలని లేదా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని యూఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన సమాచారం.
అసలు ఈ 'గ్రేస్ పీరియడ్' (మినహాయింపు) ఎందుకు ఇచ్చారంటే..?
ఈ ఏడాది ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, వైమానిక పరిమితుల (Airspace Restrictions) కారణంగా పలు దేశాల మధ్య విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో యూఏఈకి టూరిస్ట్ వీసాలపై వచ్చిన వేలాది మంది ప్రయాణికులు ప్లాన్ చేసుకున్న ప్రకారం తిరిగి తమ సొంత దేశాలకు వెళ్లలేకపోయారు.

ఈ అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం, మానవతా దృక్పథంతో విజిట్ వీసాదారులపై ఎలాంటి 'ఓవర్‌స్టే జరిమానాలు' పడకుండా తాత్కాలికంగా మినహాయింపు (Waiver) ఇచ్చింది. నిజానికి మార్చి నెలలోనే దేశం విడిచి వెళ్లాల్సిన చాలా మంది సందర్శకులు, ఈ నిబంధన వల్ల రూపాయి ఫైన్ కట్టకుండా మరికొన్ని నెలల పాటు యూఏఈలోనే సురక్షితంగా ఉండే అవకాశం లభించింది.
ఈ డెడ్‌లైన్ ఎవరికి వర్తిస్తుంది? రెసిడెన్స్ వీసాదారులకు కూడానా?
ట్రావెల్, ఇమ్మిగ్రేషన్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఈ జులై 9 గడువు అనేది కేవలం విజిట్ వీసా (సందర్శక వీసా) కలిగి ఉండి, విమానాల రద్దు వల్ల అక్కడ ఉండిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.
రెసిడెన్స్ వీసాదారులకు వర్తించదు:
యూఏఈలో ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఉండే 'రెసిడెన్స్ వీసా' (Residence Visa) హోల్డర్లకు ఈ నిబంధనతో ఎలాంటి సంబంధం లేదు. వారి వీసాలు రద్దయినా లేదా ఎక్స్‌పైర్ అయినా.. వారి కేటగిరీ, వృత్తిని బట్టి రెగ్యులర్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం వేరే గ్రేస్ పీరియడ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ రెండు నిబంధనలను చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దని నిపుణులు సూచిస్తున్నారు.
బాధితుల ముందున్న ఆప్షన్లు ఏంటి?
ప్రస్తుతం యూఏఈలో చిక్కుకుపోయిన విజిట్ వీసాదారులకు అధికారులు కొన్ని మార్గాలను సూచించారు:
- లీగల్ స్టేటస్ మార్చుకోవడం: అర్హత ఉన్నవారు ఇమ్మిగ్రేషన్ ఛానల్స్ ద్వారా తమ వీసాను లీగల్ స్టేటస్‌లోకి మార్చుకోవచ్చు.
- ఉద్యోగ వీసాలు: ఈ గ్యాప్‌లో ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చి ఉంటే, వారు తమ కంపెనీల ద్వారా పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
- దేశం విడిచి వెళ్లడం: పైన పేర్కొన్న ఏ ఆప్షన్ సాధ్యం కాకపోతే.. ఎలాంటి జరిమానాలు పడకుండా ఉండటానికి జులై 9 లోపే యూఏఈని విడిచి సొంత దేశాలకు వెళ్లడం ఉత్తమం.
జులై 9 తర్వాత ఏం జరుగుతుంది?
జులై 9వ తేదీని చివరి అవకాశంగా అధికారులు ప్రకటించారు. ఈ గడువు దాటిన మరుసటి రోజు నుంచే పాత పద్ధతిలోనే సాధారణ 'ఓవర్‌స్టే రూల్స్' అమలు చేయనున్నారు. అంటే గడువు దాటిన ప్రతి రోజుకూ భారీగా పెనాల్టీలు పడతాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వెంటనే తమ వీసా స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో గానీ, టైపింగ్ సెంటర్ల ద్వారా గానీ వెరిఫై చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు గల్ఫ్ బాధితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.














Click it and Unblock the Notifications