పాక్‌పై యుద్ధం చేసే హక్కు భారత్‌కు ఉంది- ఎప్పటికైనా ప్రమాదమే
MP Priti Patel: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత జరిపిన దాడులను యూకే హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యురాలు, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ సమర్థించారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై ఈ దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు.
బ్రిటన్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారామె. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. పహల్గావ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా, అతి క్రూరంగా హతమార్చారని గుర్తు చేశారు. చాలామంది బాధితులను తలకు గురిపెట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో పహల్గామ్ కూడా చేరిందని ప్రీతిపటేల్ వ్యాఖ్యానించారు. పహల్గామ్ దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని ఆమె కోరుకుంటూనే పాకిస్తాన్ భూభాగంపై కొనసాగుతోన్న ఉగ్రవాద సంస్థల నుండి ఎదురవుతోన్న సవాళ్లు, ముప్పును బ్రిటన్ గుర్తించాలని కోరారు.
దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదని, ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయని, ఇది ఆ దేశ హక్కుగా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమౌతాయని చెప్పారు.
ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడని ప్రీతి పటేల్ గుర్తు చేశారు. ఒక కరడుగట్టిన ఉగ్రవాదికి ఆశ్రయాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తనవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందాలు కుదిరాయని ప్రీతి పటేల్ గుర్తు చేశారు. వాటి ఆధారంగా ఉగ్రవాద నిర్మూలనలో బ్రిటన్ మరింత చురుకుగా పాల్గొనాలని, భారత్‌కు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రపంచ దేశాలు సమష్టిగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రదేశాలతో కలిసి పని చేయడానికి బ్రిటన్ చొరవ చూపాలని అన్నారు.
బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రీతి పటేల్ చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం బ్రిటన్ నిఘా, భద్రత విభాగం.. కనీసం భారత్‌తో సంప్రదింపులు జరిపాయా? ఆ దేశం మొదలుపెట్టిన దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నాయా అని నిలదీశారు.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారతకు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను లష్కరే తోయిబా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. ఎప్పటికైనా అవి ప్రమాదమేనని గుర్తించాలని సూచించారు.












Click it and Unblock the Notifications