వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ukraine-Russia War: ‘Sex tradeలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’, వలంటీర్ల ముసుగులో చీకటి వ్యాపారం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అపరిచిత వ్యక్తులు శరణార్ధులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు
Click here to see the BBC interactive

ఐదు వారాలుగా సాగుతున్న రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. బాంబుల మోత, రక్తపాతం, ప్రజల్లో ఆందోళన. పిల్లలకు స్కూళ్లు లేవు. వైద్యం లేదు, ముఖ్యంగా వృద్ధులకు. దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాని పరిస్థితి.

ఇప్పటికే కోటి మంది తమ ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవడానికి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వీరిలో చాలామంది యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వీళ్లంతా దాదాపు క్షేమంగానే ఉన్నారు.

కానీ, కనీసం 35 లక్షల మంది యుక్రేనియన్లు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో తలదాచుకున్నారు. అందులో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. 60ఏళ్లలోపు మగవాళ్లు దేశంలోనే ఉండాలని యుక్రెయిన్ ప్రభుత్వం కోరింది.

దేశందాటి వెళ్లిపోయిన వారికి ఏం చేయాలో, ఎటుపోవాలో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో వారంతా పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం, సహాయం పొందడం లాంటివి చేయాల్సి ఉంటుంది. మరి వారి భద్రత మాటేంటి?

''మనుషుల్ని అక్రమంగా రవాణా చేసేవారికి యుక్రెయిన్ యుద్ధం ఒక విషాదం కాదు. అవకాశం. మహిళలు, చిన్నారులే వాళ్ల లక్ష్యం'' అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

అనేకమంది మహిళలు పిల్లలతో కలిసి సరిహద్దులకు వస్తున్నారు

మామూలు సమయంలో యుక్రెయిన్ చుట్టు పక్కల ప్రాంతాలలో మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు యాక్టివ్‌గా ఉంటాయి. ఇప్పుడు యుద్ధం పరిస్థితులు వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి.

పిల్లల పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని లుబ్లిన్ ప్రాంతంలో మానవ హక్కుల కార్యకర్తగా పని చేస్తున్న హోమోఫేబర్ సంస్థ కోఆర్డినేటర్ కరోలినా వియర్జ్‌బిన్‌స్కా అన్నారు. యుక్రెయిన్ దాటి వస్తున్న చాలామంది చిన్నారుల వెంట పెద్ద వాళ్లు ఉండటం లేదని ఆమె అన్నారు.

కనిపించకుండా పోయిన పిల్లల కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే, దీనర్ధం అక్కడ చాలామంది చిన్నారులు తప్పిపోతున్నారు. వారిలో చాలామంది ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలియదు.

పరిస్థితులను అంచనా వేయడానికి నేను, నా కొలీగ్ ఒకరు పోలీష్-యుక్రెయిన్ సరిహద్దుల్లోని రైల్వేస్టేషన్‌కు వెళ్లాం. అక్కడికి ఎక్కువ మంది శరణార్ధులు వస్తుంటారు. స్టేషన్ దగ్గర ఎటు చూసినా మహిళలు, పిల్లలు ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో కనిపించారు.

శరణార్థులకు వేడి వేడి ఆహారం, దుప్పట్లు అందిస్తూ, హైఫై యూనిఫాంలలో అనేకమంది వలంటీర్లు కనిపిస్తారు. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.

మేం మార్గరిటా హుస్మనోవ్ అనే కీయెవ్‌కు చెందిన యువతిని సరిహద్దులో ఉన్న శరణార్థి శిబిరంలో కలుసుకున్నాం. 20ఏళ్ల వయసున్న ఆమె, రెండు వారాల కిందట ఈ శిబిరానికి వచ్చారు. తాను తిరిగి వెళ్లగలిగే పరిస్థితులున్నా, అక్కడే ఉంటున్నారు. తనతోటి శరణార్థులు అపరిచితులు చేతిలో పడకుండా ఆమె కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్గరిటా బాధితురాలి నుంచి వలంటీర్ గా మారారు

ఇక్కడ మీరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారా అని నేను ఆమెను అడిగాను.

'ఔను. నేను దాని గురించే భయపడుతున్నాను' అని ఆమె సమాధానమిచ్చారు.

''ఇక్కడున్న మహిళలు, పిల్లలు ఘోరమైన యుద్ధం నుంచి బైటపడి తలదాచుకున్నారు. వాళ్లకు పోలిష్‌గానీ, ఇంగ్లీష్ భాషగానీ రాదు. ఏం జరుగుతుందో వాళ్లకు చెప్పేవాళ్లు లేరు. ఈ శిబిరంలోకి ఎవరైనా రావచ్చు. మొదటి రోజు నేను వలంటీర్‌గా పని చేశాను. వ్యభిచారంలోకి దింపడానికి ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. నేను పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్లు వచ్చిన తర్వాత నా అనుమానం నిజమేనని తేలింది. ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి'' అని మార్గరిటా అన్నారు.

స్థానిక అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల సంచారం పెరిగిందని, మొదట్లో శరణార్థులకు సహాయం చేస్తామంటూ ప్లకార్డులు పట్టుకుని వలంటీర్లుగా నటించిన వారు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదని మార్గరిటా అన్నారు. ఇప్పటికీ ఇలాంటి వ్యక్తులు చాలామంది వలంటీర్ల రూపంలో పని చేస్తున్నారని ఆమె వెల్లడించారు.

యుక్రెయిన్ నుంచి బైటపడి ప్రస్తుతం డెన్మార్క్‌లో క్షేమంగా ఉన్న ఎలీన మోస్క్‌విటినా, ఇదే అంశంపై ఫేస్‌బుక్‌లో హెచ్చరికలు చేశారు. మేం ఆమెను సంప్రదించి స్కైప్‌లో ఇంటర్వ్యూ చేశాం. ఆమె చెప్పిన విషయాలు మరింత భయంకరంగా ఉన్నాయి.

తాను తన పిల్లలతో సహా సరిహద్దు దాటి రొమేనియాకు వచ్చానని, కొందరు ఫేక్ వలంటీర్లు తాను ఎక్కడ ఉంటున్నానో కనుక్కున్నారని వెల్లడించారు. స్విట్జర్లాండ్ వెళ్లాలని, అది సురక్షితమైన ప్రదేశమని తనకు చెప్పారని, ఒకరకంగా అక్కడికి వెళ్లాల్సిందిగా తనను ఒత్తిడి చేశారని ఎలీనా చెప్పారు.

తాము ఒక వ్యాన్ నిండా మహిళలను తీసుకుని స్విట్జర్లాండ్ వెళుతున్నామని, వారితో పాటు వ్యాన్‌లో రావాలని ఆమెకు వారు సూచించారు. తనను, తన కూతురిని వికృతమైన చూపులు చూశారని, తన కూతురు వారి ప్రవర్తన చూసి భయపడిపోయిందని ఆమె వెల్లడించారు.

నీ కొడుకు ఎక్కడున్నాడో చూపించాలని ఆ ఫేక్ వలంటీర్లు అడిగారని, తన కొడుకును చూపించగానే వాడిని ఎగాదిగా చూశారని, నువ్వు నీ కూతురు తప్ప ఎవరూ వ్యాన్‌లో రావడానికి వీలుకాదని చెప్పినట్లు ఎలీనా గుర్తు చేసుకున్నారు.

మీరు చెప్పిన వ్యాన్‌లో మహిళలు ఉంటే తాము కూడా వస్తామని వారికి చెప్పినట్లు ఎలీనా వివరించారు. వాళ్లు అటు వెళ్లగానే, పిల్లలను తీసుకుని పారిపోయి వచ్చానని ఆమె వివరించారు.

యుక్రెయిన్ శరణార్ధులను ఎల్జిబిటా సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు

''యుద్ధ బాధితులైన మహిళలు ఇప్పటికే అనేక కష్టాలు పడ్డారు. ఇప్పుడు వాళ్లు భయంతో బతకాలా?'' అని ఎల్జీబిటా జర్ముల్స్కా ప్రశ్నించారు. పోలండ్‌కు చెందిన ఎల్జిబిటా ప్రముఖ వ్యాపారవేత్త కూడా. మహిళల కోసం ''విమెన్ టేక్ ద వీల్ ఇనిషియేటివ్’’ అనే సంస్థను స్థాపించారు.

యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇబ్బందుల్లో పడిన మహిళలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే ఆమె మిషన్ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఆమె 650 మంది మహిళలను ఎంపిక చేసి, యుక్రేనియన్ బోర్డర్ నుంచి పోలండ్‌లోకి బాధిత మహిళలను చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ ఓ శిబిరానికి వచ్చి, నాదియా, ఆమె ముగ్గురు పిల్లలను కార్లో తీసుకుని వార్సా బయలుదేరారు. కార్లోని పిల్లలకు చాక్లెట్లు బిస్కట్లతోపాటు అవసరమైన మందులను కూడా ఎల్జిబిటా అందజేశారు.

కీయెవ్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ఎంతో భయపడ్డానని, ఇప్పుడు తాను ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మహిళ కావడం చాలా రిలీఫ్ ఉందని నాదియా అన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు ఉంటారని యుక్రెయిన్ రేడియోలో హెచ్చరికలు విన్నానని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సరిహద్దులు దాటి రావాల్సి వచ్చిందని నాదియా చెప్పారు.

శరణార్థులైన వారికి సాయం చేయాలని తనకు ఉంటుందని, కానీ, ఈ సాయం ఇక్కడితో ఆగిపోతే సరిపోదని ఎల్జిబిటా అన్నారు.

మేం మాట్లాడిన వారిలో చాలామంది హింస తగ్గిపోగానే తమ సొంత దేశానికి వెళ్లిపోతామని చెప్పారు. కానీ, ఆ హింస ఒక వారం, రెండు వారాలు, నెలలు గడిచినా ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. అప్పటి వరకు వారికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండీ, పిల్లలకు స్కూలు ఉండాలి. వారిని వారు పోషించుకోవడానికి ఏదైనా ఉపాధి అవకాశాలు ఉండాలి. అక్కడే వారు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతున్నారు.

నాదియా, ఆమె పిల్లలకు ఒక మహిళా డ్రైవర్ కనిపించడం ఊరటనిచ్చింది

యుక్రెయిన్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఈయూ నేతలు నిర్ణయించారు. అయితే, వారి శ్రమను దోచుకోకుండా వారి హక్కులను ముందుగానే తెలియజేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

''నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే, స్నేహితుల్లాంటి వారు లేకపోతే, వారు జీవితంలో ఊహించని పనులు చేయాల్సి వస్తుంది'' అని ఓ వలంటీర్ నాతో అన్నారు. యువతిగా ఉన్న సమయంలో వ్యభిచారం కూపంలోకి వెళ్లి వచ్చిన ఆ వలంటీర్, ప్రస్తుతం శరణార్థులకు సహాయం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు.

''నేను వారిని రక్షించాలి. ప్రమాదాల గురించి వారిని హెచ్చరించాలి'' అని ఆమె అన్నారు. అయితే, తనపేరును వెల్లడించవద్దని, తన గతం పిల్లలకు తెలియడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపారు.

శరణార్థులకు అందుతున్న సాయం పూర్తిగా నిజాయితీతో కూడినదని చెప్పే పరిస్థితి కూడా లేదు. వ్యవస్థీకృతంగా నేరాలు చేసేవారే కాదు, వ్యక్తిగతంగా కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారు కనిపిస్తారు. యుక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులకు పోలండ్, జర్మనీ, యూకేలలో చాలామంది చాలామంది ఆశ్రయం ఇస్తున్నారు.

ఇందులో చాలామంది మనసులో చెడు ఉద్దేశాలు లేవు. కానీ, అందరివీ మంచి ఉద్దేశాలైతే కాదు.

జర్మనీలోని డసెల్‌డార్ఫ్ నగరంలోని ఒక ఇంట్లో తలదాచుకున్న ఓ యుక్రెనియన్ యువతి, తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేసుకున్నారు. తనకు ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన యజమాని తన గుర్తింపు పేపర్లను లాగేసుకున్నారని, తన ఇంటి పనంతా ఫ్రీగా చేయాలని బెదిరించారని ఆమె వెల్లడించారు.

అంతటితో ఆగని ఆ వ్యక్తి, లైంగికంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడని, అందుకు అంగీకరించకపోవడంతో తనను ఇంటి నుంచి గెంటి వేశాడని ఆ పోస్టులో ఆ మహిళ పేర్కొన్నారు.

శరణార్ధుల నిస్సహయా స్థితిని సొమ్ము చేసుకోవాలని కొందరు భావిస్తున్నారు

''ఇలాంటివి సర్వసాధారణమయ్యాయి. యుద్ధం ఉన్నా లేకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే యుక్రెయిన్ నుంచి ఎక్కువమంది మహిళలు వస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతోంది'' అని ఇరేనా డేవిడ్ ఒల్సిజిక్ అన్నారు.

ఆమె లా స్ట్రాడా అనే యాంటీ ట్రాఫికింగ్ ఎన్జీవో వార్సా శాఖకు చీఫ్ ఎగ్జిక్యుటివ్‌గా పని చేస్తున్నారు.

యువతులకు ఇలాంటి ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, కొందరు యువతులు విలాసాలు కోరుకుని డబ్బులున్న వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తుంటారని, ఇక్కడ కేవలం మధ్యవర్తులను, మగవాళ్లను తప్పుబట్టి ప్రయోజనం లేదని ఇరేనా అన్నారు.

ఆన్‌లైన్‌లో సాయం పొందేందుకు చాలామంది యుక్రేనియన్ యువతులు ప్రయత్నాలు చేస్తున్నారని, సమస్యల నుంచి బైటపడటానికి వాళ్లు తొందర పడుతున్నారని కూడా ఇరేనా చెప్పారు.

తమకు తెలియని వ్యక్తులు విమానం టిక్కెట్లు పంపిస్తే వెళ్లిపోవడానికి కొందరు సిద్ధపడుతున్నారని, అలాంటి వారిని అడ్డుకోవడానికి తాము ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

''ఒక 19 ఏళ్ల అమ్మాయిని తన స్నేహితురాలు ఉంటున్న అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించాం. ఆమె స్నేహితురాలు అప్పటికే ఆ వ్యక్తి చేతిలో హింసకు గురైందని ఆమెకు తెలుసు. కానీ, ఆ వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి తీయని మాటలు, మంచి బహుమతులు ఇచ్చాడు'' అన్నారు ఇరేనా.

''ఇలాంటి వారి ఇళ్లకు వెళ్లే ముందు కనీసం స్థానిక అధికారుల దగ్గర పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని మేం చెబుతుంటాం. మా ఫోన్ నంబర్లు కూడా వాళ్లకు ఇస్తుంటాం. అవసరమైనప్పుడు వాళ్లు మాకు ఫోన్ చేస్తారని అనుకుంటున్నాం'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine Russia war:Volunteers search fir Beautiful women for sex trade
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X