50 మంది రష్యా దురాక్రమణదారుల్ని చంపేశాం-6 విమానాలు కూల్చేశాం-ఉక్రెయిన్ ప్రకటన
అంతా ఊహించినట్లుగానే ఉక్రెయిన్ పై రష్యా ఇవాళ యుద్ధం మొదలుపెట్టేసింది. యూరప్ లో తమ దేశం తర్వాత రెండో అతిపెద్ద దేశమైన ఉక్రెయిన్ కు నాటోలో చోటు కల్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని నిరసిస్తూ ఆ దేశంపై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. అయితే యుద్ధం మొదుపెట్టిన తొలిరోజే రష్యాకు ఎదురుదెబ్బలు తలుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చెందిన 50 మంది దురాక్రణదారుల్ని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా రష్యా సైన్యానికి చెందిన వారే. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో ప్రవేశించి దాడులకు దిగిన సందర్భంగా వీరిని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో పాటు ఆరు రష్యా విమానాల్ని కూడా కూల్చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా నుంచి ఎదురవుతున్న పోరును గట్టిగా ప్రతిఘటిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అలాగే తమ పౌరుల్ని కూడా 8 మందిని కోల్పోయినట్లు పేర్కొంది.

అయితే ఉక్రెయిన్ ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. ఇప్పటివరకూ తమ విమానాలు కూలిపోలేదని, తమ సైనికులకు ఎలాంటి హాని జరగలేదని వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారంపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు రష్యా దురాక్రమణపై తొలుత మౌనంగా ఉన్నట్లు కనిపించిన ఉక్రెయిన్ ఆ తర్వాత తేరుకుని ప్రతి దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వారిని పిలిపించి ఆయుధాలు అప్పగించడమే కాకుండా ఆయుధాల్ని ఆపరేట్ చేయగలిగిన ప్రతీ ఒక్కరికీ వాటిని అందిస్తోంది. తద్వారా రష్యా దాడిని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా యుద్ధం కొనసాగిస్తే ఎలాగో నాటోతో పాటు ఈయూ నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉండటంతో ప్రతిఘటనకే ఉక్రెయిన్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
.












Click it and Unblock the Notifications