రష్యా వ్యూహాత్మక వెనకడుగు ?-ఉక్రెయిన్ డౌట్స్-మే 9 వరకూ అలర్ట్ ఇచ్చిన జెలెన్ స్కీ
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి 38 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికీ యుద్ధం ఏ మలుపు తీసుకుటుందో ఎవరికీ తెలియడం లేదు. అయితే తాజాగా ఉక్రెయిన్ తో చర్చల తర్వాత రష్యా మాత్రం వ్యూహాత్మకంగా తమ సేనల్ని వెనక్కి తీసుకుంటోంది. రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల నుంచి రష్యా సేనలు వెనక్కి మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వెనుకడుగు వ్యూహాత్మకమేనా ? రష్యా తిరిగి విరుచుకపడుతుందా ? ఉక్రెయిన్ అనుమానాలివే

ఉక్రెయిన్ లో యుద్ధానికి విరామం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై 38 రోజులు గడిచిన తర్వాత ఎట్టకేలకు యుద్ధానికి విరామం లభించింది. పలు దఫాలుగా సాగిన చర్చల తర్వాత రష్యా ఉక్రెయిన్ లో ఉన్న తమ బలగాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఉక్రెయిన్ లో రష్యా పోరు తాత్కాలికంగా అయినా ఆగడం ప్రపంచ దేశాలకు ఊరటనిస్తోంది. అయితే అదే సమయంలో ఉక్రెయిన్ పై మాత్రం టెన్షన్ పెంచుతోంది. యుద్ధం ఆగిన తర్వాత కూడా ఉక్రెయిన్ లో ఎందుకు టెన్షన్ పెరుగుతుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.

రష్యాపై ఉక్రెయిన్ అనుమానాలు
ఉక్రెయిన్ తో చర్చల్లో అంగీకరించిన మేరకు రష్యా తన బలగాలను వెనక్కి రప్పిస్తోంది. అయితే ఎదురుదాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తో చర్చలు సాగించి రష్యా తన సేనల్ని వెనక్కి పిలిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికాధికారులు ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఉక్రెయిన్ ను నాశనం చేస్తే కానీ తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్న రష్యా.. ఇలా వెనక్కి తగ్గడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో రష్యా తీరుపై ఉక్రెయిన్ లో పలు చర్చలు సాగుతున్నాయి.

జెలెన్ స్కీ హెచ్చరికలు
ఉక్రెయిన్ నగరాల నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా అనుమానిస్తున్నారు. రష్యా వెనక్కి తగ్గినట్లు తగ్గి విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని జెలెన్ స్కీ భావిస్తున్నారు. ఉక్రెయిన్ లో తగులుతున్న ఎదురుదెబ్బలతో రష్యా తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే వెనక్కుమళ్లుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్తున్నారు. వాళ్లకు విజయం కావాలని ఆయన తెలిపారు. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా మే 9వ తేదీ రష్యా 'విక్టరీ డే' పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. వాళ్లకు ఆ రోజు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉందని, ఆలోపు ఏదైనా జరగొచ్చని జెలెన్ స్కీ చెప్తున్నారు. కాబట్టి ఉక్రెయిన్ వాసులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చంటూ హెచ్చరిస్తున్నారు.

రష్యా అడుగులు వ్యూహాత్మకమేనా ?
ఉక్రెయిన్ లో రష్యాకు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందులో దాదాపు 18 వేల మంది సైన్యాన్ని కూడా కోల్పోయింది. అలాగే మందుగుండు సామాగ్రి కూడా నిండుకుంది. ఆయుధాల కొరత కూడా వేధిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కొంగొత్త అస్త్రాలు కావాలన్నా అందడం లేదు. దీంతో యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటించి ఆ లోపు తిరిగి అస్త్రాలు పోగోసుకుని వార్ మొదలుపెట్టాలని రష్యా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని నగరాల నుంచి వ్యూహాత్మకంగా సేనలు విరమించుకుంటోంది. దీన్ని చూసి యుద్ధం ముగిసిందని ఉక్రెయిన్ భావిస్తే ఒక్కసారిగా రష్యా విరుచుకుపడే ప్రమాదం ఉందని సైనికాధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications