భారత్ లో తాలిబన్ మంత్రి టూర్ ...! ఐరాస కీలక నిర్ణయం..!
ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ల పాలన కొనసాగుతోంది. గతంలో ఆప్ఘనిస్తాన్ కు వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చిన భారత్.. అప్పట్లో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి సైతం మద్దతు ఇచ్చింది. అయితే ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తాలిబన్లు రెండేళ్ల క్రితం అధికారం చేపట్టారు. ఆ తర్వాత తాలిబన్లు పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాలిబన్ల మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత్ లో పర్యటించేందుకు సిద్దమయ్యారు.
అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఎదురైంది. ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో పర్యటించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందస్తు అనుమతి అవసరం. ఇందుకోసం తాలిబన్ మంత్రి దరఖాస్తు చేసుుకున్నారు. భారత్ లో ఈ నెల 9 నుంచి 16 వరకూ తాను పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఆయన పర్యటనకు ఐరాస అనుమతి ఇవ్వలేదు.

కానీ ఇప్పుడు భారత్ కూడా ఆప్ఘన్ తాలిబన్ మంత్రి పర్యటనపై సానుకూలంగా ఉండటంతో ఐరాస భద్రతా మండలి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1988లో ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్లపై విధించిన ఆంక్షల తీర్మానం మేరకు అక్కడి నేతలు ఇతర దేశాల్లో పర్యటించాలంటే ఐరాస ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. ఈ మేరకు తాలిబన్ల ప్రభుత్వం నుంచి విజ్ఞాపన రావడం, భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ టూర్ కు అనుమతి లభించింది.

పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్, చైనాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న భారత్ కు ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లతో బంధం కీలకంగా మారింది. అందుకే ఆప్ఘన్ లోని తాలిబన్ల ప్రభుత్వంతో సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు వారి మంత్రిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి ఐరాస కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారత్ లో తాలిబన్ మంత్రి పర్యటన ఆసక్తి రేపుతోంది. ఈ టూర్లో భారత్-ఆప్ఘన్ ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకునే నిర్ణయాలు పాక్, చైనాకు షాకిచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications