ప్రత్యక్ష యుద్ధానికి దిగిన అమెరికా: ఆపరేషన్ రెడ్ సీ: తీవ్ర ఉద్రిక్తత
Joe Biden: అగ్రరాజ్యం అమెరికా.. యుద్ధానికి దిగింది. యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. సుదీర్ఘ విరామం తరువాత అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, అది కూడా మధ్య తూర్పు దేశంపై కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది అమెరికా. బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు.. ఈ దాడుల్లో అమెరికా సైన్యానికి తమవంతు సహాయ, సహకారాలను అందించాయి. త్వరలో భారత్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది.

అమెరికా ఈ దాడులకు దిగింది- యెమెన్‌పై. ఈ దేశంలోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను ప్రారంభించినట్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తోన్న హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
కొద్ది రోజులుగా ఆసియా సహా పలు పాశ్చాత్య దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారులు. యెమెన్‌కు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రంపై పట్టును సాధించారు. ఈ మార్గంలో తిరుగాడే నౌకలను తమ ఆధీనంలో తెచ్చుకుంటోన్నారు. సిబ్బందిని అపహరిస్తోన్నారు. ఇటీవలే భారత్‌కు చెందిన నౌకను కూడా హౌతీ రెబెల్స్ స్వాధీన పర్చుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను సైతం వినియోగిస్తోండటం ఆందోళన కలిగించే అంశం. ఎర్ర సముద్రం గుండా రాకపోకలు సాగించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇప్పటివరకు 27 సార్లు దాడులకు పాల్పడ్డారు హౌతి తిరుగుబాటుదారులు. దీనివల్ల 50కి పైగా దేశాలు ప్రభావితం అయ్యాయి. 20కి పైగా దేశాలకు చెందిన సిబ్బంది బందీలుగా పట్టుకున్నారు.
వారి బారిన పడకుండా ఉండటానికి ఈ మధ్యకాలంలో ఆయా దేశాలేవీ కూడా ఎర్ర సముద్రాన్ని వినియోగించట్లేదు. 2,000కు పైగా వాణిజ్య నౌకలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా, వాణిజ్యం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జల మార్గాల రవాణా స్వేచ్ఛకు ప్రమాదంలో పడింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులను ఆదేశించినట్లు జో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎలాంటి అశాంతియుత వాతావరణాన్ని సంహించబోమని పేర్కొన్నారు. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో అమెరికా నౌకలు సైతం ఉన్నాయని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications