నీరవ్‌కి అమెరికాలో ఊరట.. రుణ వసూళ్లు చేయొద్దు, స్టాక్ హెల్డర్స్‌కు కోర్టు ఆదేశం!
వాషింగ్టన్: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణను శుక్రవారం న్యాయస్థానం చేపట్టింది.
నీరవ్ మోడీ దగ్గరినుంచి ఇప్పుడే రుణాలను వసూలు చేయరాదంటూ రుణదాతలను కోర్టు ఆదేశించింది. రుణాల వసూళ్ల పేరిట అతడిపై ఎటువటి ఒత్తిడి తీసుకురావద్దని పేర్కొంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు రెండు పేజీల నివేదికను విడుదల చేసింది.

రుణదాతలు డబ్బు వసూలు చేయకూడదు...
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12 వేల కోట్లకు ముంచేసి అమెరికా పారిపోయిన నీరవ్ మోడీ అమెరికా కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శుక్రవారం విచారణ జరిపిన అమెరికా కోర్టు నీరవ్ మోడీకి ఊరట కలిగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నీరవ్ మోడీకి రుణాలు ఇచ్చిన రుణదాతలు, సంస్థలు ఆయన దగ్గర్నుంచి డబ్బు తిరిగి తీసుకోవడం కుదరదు.

నీరవ్ ఆస్తుల స్వాధీనమూ కుదరదు...
అమెరికా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నీరవ్ మోడీకి, ఆయన సంస్థకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి కూడా చేయరాదు. అంతేకాదు, నీరవ్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే పిటిషన్లు కూడా రుణదాతలు ఏ న్యాయస్థానంలోనూ దాఖలు చేయకూడదు. తమ వద్ద తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందిగా రుణదాతలు నీరవ్ మోడీకి ఫోన్ చేయడం కానీ, లేదా ఈ-మెయిల్ పంపి డిమాండ్ చేయడం కానీ చేయకూడదు.

అలా చేస్తే.. రుణదాతలపై చర్యలు...
ఒకవేళ కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా రుణదాతలు రుణాల వసూలుకు ప్రయత్నించినా, నీరవ్ మోడీని ఒత్తిడిచేసినా, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా.. సదరు రుణదాతలపై కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు కోర్టు తన ఉత్తర్వులకు సంబంధించిన నివేదికను ఇప్పటికే నీరవ్‌కు రుణాలు ఇచ్చిన స్టాక్ హోల్డర్స్‌కు పంపించింది.

నీరవ్ కంపెనీ కొనుగోలుపై ఆమెరికా కంపెనీల ఆసక్తి...
నీరవ్ మోడీ ఫిబ్రవరి 26న అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఛాప్టర్11(అమెరికా) నిబంధనల ప్రకారం ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ దీన్ని నమోదు చేసింది. వ్యాపారాన్ని సజీవంగా నిలుపుకోవడంతో పాటు రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించే వెసులుబాటు కోసం ఓ ప్రణాళికను ప్రతిపాదిస్తూ ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేస్తారు. మరోవైపు నీరవ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అమెరికాలో పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications