ఈసారి ఇంట్లోనే వినాయక చవితి..! అమెరికాలో మెసేజ్ లు పంపుకుంటున్న భారతీయులు..!
ఒకప్పుడు భారతీయులకు డాలర్ కలలుండేవి. వాటికి అనుగుణంగా ఎప్పుడు చదువులు పూర్తి చేసేయాలి, ఎప్పుడు అమెరికాకు విమానం ఎక్కి ఎగిరిపోవాలన్న ఆలోచనలే భారతీయ యువతలో ఉండేవి. కానీ ట్రంప్ హయాంలో ఆ పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. రెండేళ్లుగా అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీయులపై నింపుతున్న ద్వేషం అక్కడ భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అది చివరికి ఎందాకా వెళ్లిందంటే.. ఈసారి వినాయకచవితి వేడుకల్ని (US Ganesh Chaturthi) సైతం బయటికి రాకుండా ఇళ్లలోనే జరుపుకోవాలని అక్కడి ఎన్నారైలు కోరుతున్నారు.
ఓవైపు ట్రంప్ ప్రభుత్వం అక్రమ, సక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. విదేశీయులు మన ఉద్యోగాలు కొల్లగొట్టేస్తున్నారంటూ ట్రంప్ స్వయంగా అక్కడి పౌరుల్లో ద్వేషం నింపుతున్నారు. దీనికి తోడు ఎప్పటి నుంచో ఉన్న జాత్యహంకారం కూడా తోడైంది. దీంతో అమెరికాలోని వివిధ నగరాల్లో భారతీయులపై బహిరంగ దాడులు పెరిగాయి. కేవలం జాత్యహంకారం కారణంగా ఎన్నో దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి వినాయక చవితి వేడుకల్ని సైతం బయట జరుపుకోవద్దంటూ అక్కడి మన ఎన్నారైలు భారతీయులకు మెసేజ్ లు పంపుతున్నారట.

వాస్తవానికి గణేష్ చతుర్థిని ప్రైవేట్‌గా ఇళ్లలో, బహిరంగంగా అద్భుతమైన మండపపాలు నిర్మించి, గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి అమెరికాలో భారతీయులు జరుపుకుంటారు. అమెరికాలో భారతీయ-అమెరికన్, ఎన్నారై జనాభా పెరుగుతున్నందున, ఈ పండుగకు ప్రాముఖ్యత కూడా పెరిగింది. ప్రతి సంవత్సరం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, సియాటిల్ , డల్లాస్ వంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఈ వేడుకలను జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అమెరికాలోని భారతీయులు గణేష్ చతుర్థిని బహిరంగంగా జరుపుకోవద్దని పరస్పరం సలహా ఇచ్చుకుంటున్నారు. తమ వేడుకలను, ఉత్సవాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం లేదా ప్రచారం చేయడం మానుకోవాలని కంటెంట్ క్రియేటర్లను కూడా కోరుతున్నారు. అమెరికాలో సోషల్ మీడియాలో, భారత్‌పై ద్వేషం, జాత్యహంకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తల పిలుపులు వస్తున్నాయి.














Click it and Unblock the Notifications
