ఇరాన్ యుద్ధ రహస్యాలు లీక్.. భయపడుతున్న ట్రంప్!
ఇరాన్ యుద్ధానికి సంబంధించిన అత్యంత రహస్యకరమైన సమాచారం మీడియాకు ఎలా లీక్ అయిందనే విషయంపై అమెరికా సర్కారు తీవ్ర స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ జాయింట్ స్టాఫ్‌లోని సుమారు 50 మంది సభ్యులకు పాలిగ్రాఫ్(లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించడం కలకలం రేపుతోంది. సైనిక వ్యూహాలు, ఆయుధాల స్థితిగతుల సమాచారాన్ని మీడియాకు చేరవేసిన వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ విచారణ వేగవంతమైంది.
ఏమిటీ పాలిగ్రాఫ్ పరీక్ష?
సాధారణంగా పాలిగ్రాఫ్ పరీక్షను 'లై డిటెక్టర్ టెస్ట్' అని పిలుస్తారు. ఓ వ్యక్తి ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పే సమాధానాలను బట్టి వారి శ్వాస వేగం, హృదయ స్పందన రేటు, శరీరంలో వచ్చే మార్పులను యంత్రాల ద్వారా నమోదు చేస్తారు. ఈ శారీరక స్పందనల ఆధారంగా వారు నిజం చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అనేదాన్ని పరిశోధకులు అంచనా వేస్తారు. అయితే ఓ వ్యక్తి ఒత్తిడిలో ఉండటం వల్ల కూడా ఈ మార్పులు రావచ్చని, అందుకే దీనిని దర్యాప్తులో భాగమైన ఆధారంగానే పరిగణిస్తారని.. నిశ్చయాత్మక నిరూపణగా కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అమెరికా ఆయుధాల కొరత వార్తలతో మొదలైన వివాదం
ఈ సమాచారాన్ని అమెరికన్ వార్తా సంస్థ 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం యూఎస్ సైనిక దళాల జాయింట్ స్టాఫ్‌కు సంబంధించిన సుమారు 50 మంది వ్యక్తులు విచారణ పరిధిలోకి వచ్చారు. వీరిలో సైనిక అధికారులు కొంతమంది పౌర ఉద్యోగులు ఉన్నారు. అమెరికా వద్ద తరిగిపోతున్న ఆయుధ నిల్వల గురించి మీడియాకు సమాచారం అందించారా లేదా అనే విషయంపై గత నెలలో వారిని ప్రశ్నించారు.
యుద్ధ సమయంలో దేశీయ సైనిక బలం, ఆయుధ సంపత్తికి సంబంధించిన డేటా బయటకు పొక్కడం అనేది సాధారణ విషయం కాదు. ఇది జాతీయ భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. అమెరికా ఆయుధాల కొరత గురించి వివరాలు లీక్ అవ్వడం వల్ల శత్రు దేశాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అమెరికా దర్యాప్తు సంస్థలు సైనక వ్యవస్థ లోపలి పొరల్లోకి వెళ్లి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కారణంగా జాయింట్ స్టాఫ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రశ్నించారు, ఈ దర్యాప్తులో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
పెంటగాన్ ఏమి చెప్పిందంటే?
పెంటగాన్ ఈ దర్యాప్తుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను అందించడానికి నిరాకరించింది. నివేదిక ప్రకారం అంతర్గత సిబ్బంది లేదా దర్యాప్తులకు సంబంధించిన విషయాలపై తమ శాఖ వ్యాఖ్యానించదని పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ వెల్లడించారు. జాతీయ భద్రతా సమాచారం లీక్ అయిన ప్రతి విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్జీనియాలోని పెంటగాన్ కార్యాలయంలో ఈ విచారణ పర్వం కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications