ఏపీలో వర్జీనియా పొగాకుపై కేంద్రం తాజా నిర్ణయం- నోటిఫికేషన్
ఏపీలో పొగాకు పంట సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 పంట కాలానికి సంబంధించి మిగులు పొగాకును విక్రయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. పొగాకు బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోని రైతులు పండించిన వర్జీనియా (ఫ్లూయిడ్ కర్వ్డ్ వర్జీనియా) పొగాకును కూడా అమ్ముకోవడానికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయంలో ప్రత్యేక నిబంధనలను సైతం సడలించింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలోని వేలాది మంది రైతులకు భారీ ఉపశమనం కల్పించినట్టయింది. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని అధికారిక ఈ-వేలం ప్లాట్ ఫామ్ ల ద్వారానే ఈ విక్రయాలు సాగనున్నాయి. గత నిబంధనల ప్రకారం.. ఇటువంటి అనధికారిక విక్రయాలపై కఠిన ఆంక్షలు ఉండేవి. అవి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవి. పొగాకు బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోని రైతులు ఈ ప్లాట్ ఫామ్ల ద్వారా వర్జీనియా పొగాకు వేలంలో పాల్గొనడానికి అనుమతి ఉండేది కాదు. తాజా ఉత్తర్వులతో ఆ సమస్య తీరిపోనుంది.

పొగాకు సాగు చేసే రైతులు మార్కెట్‌లో నష్టాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని గతంలో రైతు సంఘాలు కేంద్రాన్ని కోరాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని జూలైలో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఏపీలో పర్యటించింది. స్థానిక మార్కెట్ పరిస్థితులు, రైతుల క్షేత్రస్థాయి అవసరాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఆ టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.
సాధారణంగా పొగాకు బోర్డు నిబంధనల ప్రకారం.. నిర్ణీత పరిమితికి మించి పొగాకును సాగు చేస్తే వాటి అమ్మకాలపై నియంత్రణలు ఉంటాయి. బోర్డులో నమోదు చేసుకోని రైతులు పండించే పొగాకు విక్రయాలపై కఠిన జరిమానాలు, నిషేధాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, సాగుదారులకు నష్టం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. దీనివల్ల రైతులకు ఎటువంటి పెనాల్టీ లేకుండా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే వీలు కలుగుతుంది.
వర్జీనియా పొగాకును ఓ ప్రత్యేక ప్రాసెసింగ్ విధానం ద్వారా తయారు చేస్తారు. దీనిని పొగ రహితంగా, ప్రత్యేకంగా నిర్మించిన బార్న్ లలో వేడి గాలి సహాయంతో ఎండబెడతారు. ఈ విధానం వల్ల పొగాకు రంగు, నాణ్యత చెక్కు చెదరదు. ఈ రకమైన క్యూరింగ్ పద్ధతికి అంతర్జాతీయ మార్కెట్, ఎగుమతిదారులలో మంచి డిమాండ్ ఉంటోంది.













Click it and Unblock the Notifications
